అమ్మో.. ఆడబిడ్డా! | - | Sakshi
Sakshi News home page

అమ్మో.. ఆడబిడ్డా!

Nov 14 2026 7:39 AM | Updated on Nov 14 2026 7:39 AM

సాక్షి, రంగారెడ్డిజిల్లా: కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు కనికరం లేకుండా అబార్షన్లు చేయిస్తున్నారు. కన్ను తెరవక ముందే కాటికి పంపుతున్నారు. ఫలితంగా జిల్లాలో బాలబాలిక నిష్పత్తిలో భారీ వ్యత్యాసం నమోదవుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది బాలురకు 950 మంది బాలికలు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య భారీగా తగ్గింది. 2024–25లో మొత్తం 39,746 ప్రసవాలు జరిగితే వీటిలో 20,638 బాలురు జన్మించగా, 19,108 మంది బాలికలు జన్మించారు. బాలబాలికల నిష్పత్తి 926గా నమోదైంది. 2025–26లో మొత్తం 40,689 ప్రసవాలు జరిగితే వీటిలో 21,283 బాలురు, 19,406 మంది బాలికలు జన్మించారు. బాలబాలికల నిష్పత్తి 912 నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆడో, మగో చెప్పేస్తున్నాయి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి గుర్తింపు పొందిన స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ, జనరల్‌ నర్సింగ్‌హోమ్స్‌, పీడియాట్రిక్‌ క్లినిక్స్‌, ఈఎన్‌టీ, కంటి ఆస్పత్రులు, డెంటల్‌ క్లినిక్స్‌ 2,300 వరకు ఉన్నట్లు అంచనా. వీటిలో 350 వరకు డయాగ్నోస్టిక్స్‌ ఉన్నాయి. రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఎముకల ధృడత్వం, శరీరంలోని వివిధ అంతర్గాత అవయవాల పనితీరును పరీక్షించాల్సిన సెంటర్లు కాసులకు కక్కుర్తిపడి కడుపులో ఉన్నది ఆడో, మగో చెప్పేస్తున్నాయి. అప్పటికే ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు మళ్లీ ఆడబిడ్డే పుట్టనుందని తెలిసి ఆబార్షన్లు చేయించుకుంటున్నారు. మరికొంత మంది ఏకంగా మగపిల్లలు మాత్రమే కనాలని కండి షన్లు పెడుతున్నారు. తల్లిదండ్రుల్లో ఉన్న ఈ బలహీనతను కొన్ని డయాగ్నోస్టిక్స్‌ యాజమాన్యాలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. వనస్థలిపురంలోని హయగ్రీవ ఆస్పత్రిలో గర్భనిర్ధారణ పరీక్షలు చేస్తూ ఇటీవల అధికారులకు అడ్డంగా దొరికారు. పీఎన్‌డీటీసీ యాక్ట్‌ కింద ఆస్పత్రి డైరెక్టర్‌ సహా ల్యాబ్‌ టెక్నీషియన్‌ను అరెస్ట్‌ చేశారు. మెడికల్‌ షాపుల్లో ఎలాంటి ప్రిస్కిప్షన్లు లేకుండానే ఎంటీపీ కిట్లు విక్రయిస్తున్నారు. పరోక్షంగా ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోవడానికి కారణమవుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయా డయాగ్నోస్టిక్‌ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి, అక్రమార్కుల ఆగడాలను అరికట్టాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వారిచ్చే కమీషన్లకు ఆశపడి అటు వైపు తొంగిచూడడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

పీఎన్‌డీటీసీ చట్టం ఏం చెబుతోందంటే..

● కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏమైనా జన్యుపరమైన లోపాలున్నాయా.. శిశువు శారీరక, మానసిక ఎదుగుదల ఎలా ఉంది.. అనే అంశాలను తెలుసుకునేందుకు మాత్రమే అల్ట్రాసౌండ్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

● కడుపులో ఉన్నది ఆడో, మగో ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకూడదు.

● లింగనిర్ధారణ పరీక్షకు సహకరించిన వారికి మూడు నెలల జైలు, రూ.10 వేల జరిమానా విధించే అవకాశం ఉంది.

● రెండోసారి కూడా ఇదే తప్పు చేసిన వారికి ఐదేళ్ల జైలు, రూ.50 వేల జరిమానా విధిస్తారు.

● ఇలాంటి పనికి పూనుకున్నది వైద్యులైతే వారి వృత్తి లైసెన్సు రద్దవుతుంది.

● గర్భంలోని శిశువును ఆడ, మగ పోల్చమని కోరిన వారికి కూడా జైలు, రూ.50 వేల జరిమానా విధించొచ్చు.

రంగారెడ్డిలో నమోదైన ప్రసవాలు..

ప్రతి వెయ్యి మంది బాలురకు బాలికల నిష్పత్తి

సంవత్సరం ప్రసవాలు నిష్పత్తి

2020–21 40,998 892

2021–22 42,884 925

2022–23 42,823 917

2023–24 40,761 907

2024–25 39,746 926

2025–26 40,689 912

ఆడపిల్ల అని తెలిస్తే చాలు అబార్షన్లు

ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్న కొన్ని డయాగ్నోస్టిక్స్‌

కడుపులో ఉన్నది ఆడో, మగో చెప్పేస్తున్న సెంటర్లు

రంగారెడ్డి జిల్లాలో బాలబాలికల నిష్పత్తిలో భారీ వ్యత్యాసం

వెయ్యి మంది బాలురకు .. 912 మంది బాలికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement