సంచలనాలకు కేరాఫ్‌ | - | Sakshi
Sakshi News home page

సంచలనాలకు కేరాఫ్‌

Nov 14 2026 7:39 AM | Updated on Nov 14 2026 7:39 AM

హుడాకాంప్లెక్స్‌: ఒకప్పుడు వైద్యులు, వైద్యశాలలకు నిలయంగా మారిన సరూర్‌నగర్‌ పరిసర ప్రాంతాలు ప్రస్తుతం మెడికల్‌ (నకిలీ వైద్యులు, మందులు, అనైతిక వైద్య చికిత్సలు) మాఫియాకు అడ్డాగా మారాయి. నాలుగేళ్ల క్రితం సరోగసి మదర్స్‌ కేసులు వెలుగు చూడగా, రెండేళ్ల క్రితం కిడ్నీరాకెట్‌, ప్రస్తుతం అండాల సేకరణ రాకెట్‌ బయటికి వచ్చింది. నిత్య సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఎప్పటికపుడు ఆయా ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించి, అక్రమార్కులకు చెక్‌ పెట్టాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సైతం వారితో అంటకాగుతున్నట్లు విమర్శలు లేకపోలేదు.

కొరవడిన పర్యవేక్షణ

విజయవాడజాతీయ రహదారికి అటూఇటుగా సరూర్‌నగర్‌ మండలం విస్తరించి ఉంది. ఏపీ సహా తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లావాసులు కూడా ఎక్కువగా స్థిరపడుతుంటారు. ఇక్కడ పేదలే ఎక్కువగా ఉంటారు. అనేక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు, జనరల్‌ నర్సింగ్‌ హోమ్స్‌, చిన్నచిన్న క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్స్‌, మెడికల్‌ షాపులు వెలిశాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో వీటిలో కొన్ని ఆస్పత్రులు అనైతిక వైద్య చికిత్సలకు పాల్పడుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రులు, క్లినిక్స్‌ ఏర్పాటు చేయడంతో పాటు ఖరీదైన అవయవ మార్పిడీ చికిత్సలను గుట్టుగా చేస్తున్నాయి. రోగుల ప్రాణాలతో చలగాటమాడుతున్నాయి.

అధికారుల అండదండలు

ఆస్పత్రులకు కొత్తగా అనుమతులు, రెన్యూవల్స్‌ జారీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు కూడా ఇక్కడ ఎక్కువే. సీజ్‌ చేసిన ఒక ఫిజియోథెరపీ సెంటర్‌ను తిరిగి ఓపెన్‌ చేసేందుకు రూ.2 లక్షలు డిమాండ్‌ చేసి డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి సహా ఇద్దరు ఉద్యోగులు ఏసీబీ కేసులో అరెస్ట్‌ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి మెడికల్‌ మాఫియాకు అధికారుల అండదండలు సైతం పుష్కలంగా అందుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు.

‘అలకనంద’లో కిడ్నీరాకెట్‌

డాక్టర్స్‌ కాలనీలో రెండేళ్ల క్రితం అలకనంద ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్‌ బయట పడింది. మాదన్నపేటలో మొదలైన ఈ కిడ్నీ రాకెట్‌ మూలాలు సరూర్‌నగర్‌ మీదుగా కర్ణాటక, తమిళనాడు, శ్రీలంక వరకు వేల్లూనుకున్నట్లు వెల్లడైంది. అప్పట్లో ఈ అంశం పెద్ద చర్చనీయాంశమైంది. అనైతిక కిడ్నీ మార్పిడీ చేస్తున్న వైద్యులు సహా మరో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

హాస్టళ్ల మాటున అండాల సేకరణ

శివారు జిల్లాల నుంచి వలస వచ్చిన వారు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. పేదల బస్తీలు కూడా ఎక్కువ. ప్రజల అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని కొంత మంది వారికి డబ్బును ఆశచూపి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. కొన్ని ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులు ఎవరికీ అనుమానం రాకుండా పశ్చిమబెంగాల్‌, బిహార్‌, ఒడిశా ప్రాంతానికి చెందిన మహిళలను ఇక్కడికి తీసుకొచ్చి, హాస్టళ్లలో ఉంచి, సరోగసి మదర్స్‌గా మార్చుతున్నారు. యువతుల నుంచి అండాలను సేకరించి గుట్టుగా విక్రయిస్తున్నారు. అండాల సేకరణ కేసులో సరూర్‌నగర్‌లో 11 మంది మహిళలు, ఒక బ్రోకర్‌ అరెస్ట్‌ కావడం సంచలనం సృష్టిస్తోంది.

మెడికల్‌ మాఫియాకు అడ్డాగా సరూర్‌నగర్‌

అలకనంద ఆస్పత్రి కేంద్రంగా వెలుగులోకి కిడ్నీరాకెట్‌

అండాల సేకరణకు నిలయంగా మారిన హాస్టళ్లు

కొరవడిన వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ

తరచూ వెలుగు చూస్తున్న ఘటనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement