త్రుటిలో తప్పించుకున్న నలుగురు
శంషాబాద్ రూరల్: కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కాగా కారులో ఉన్న నలుగురు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. శంషాబాద్ మండల పరిధిలోని పీ–వన్ రహదారిలో గొల్లూరు చౌరస్తాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. మహేశ్వరం మండల పరిధిలో బుధవారం రాత్రి ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న శేఖర్ మాస్టర్ తెల్లవారుజామున ఇన్నోవా కారులో నగారానికి బయలుదేరారు. కారును శ్రీనివాసరావు నడుపుతుండగా శేఖర్ మాస్టర్‌తో పాటు మధుసూదన్, శ్రీకర్‌బాబు ఉన్నారు. తెల్లవారుజామున కారు గొల్లూరు చౌరస్తాలో సంఘీగూడ వైపు వెళ్లేందుకు కుడి వైపు టర్న్ తీసుకుంది. ఇదే సమయంలో పాల్మాకుల వైపు నుంచి పెద్దఅంబర్‌పేట్ వెళ్తున్న మహీంద్రా బొలేరో ట్రక్కు అదుపుతప్పి ఎగిరి వీరి కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కారు డ్రైవర్ శ్రీనివాస్‌రావు ఫిర్యాదు మేరకు పెద్దషాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయ్యప్ప దయతో ఏమీ కాలేదు: శేఖర్ మాస్టర్..
తాను షూటింగ్‌లో పాల్గొని తిరిగి హైదరాబాద్ వస్తుండగా కారు ప్రమాదానికి గురైందని శేఖర్ మాస్టర్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో నలుగురం ఉన్నామని, అయ్యప్ప దయతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్నారు.
‘రీసైకల్’లో వ్యూహాత్మక పెట్టుబడిదారుగా చేరిక..
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో వ్యర్థాల నిర్వహణను బాధ్యతాయుతమైన ప్రజా అలవాటుగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్న రీసైకల్ సంస్థతో ప్రముఖ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భాగస్వామ్యమయ్యారు. సంస్థలో వ్యూహాత్మక పెట్టుబడిదారుగా చేరిన ఆయన.. దేశవ్యాప్తంగా రీసైక్లింగ్‌పై అవగాహన పెంచడంతోపాటు ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చే ఉద్యమానికి మద్దతు ఇవ్వనున్నారు. వందకోట్ల మంది ప్రజల్లో బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణ అలవాటును పెంపొందించాలని రీసైకల్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, నిరంతర ప్రయత్నం ద్వారా పరిశుభ్రమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
చందానగర్: వాటర్ ట్యాంకర్ ఢీకొని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బీరంగూడకు చెందిన రాజ్‌కుమార్ (40) గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం గచ్చిబౌలి నుంచి బీరంగూడకు వెళ్తున్న క్రమంలో నల్లగండ్ల ఫ్లైఓవర్ సిగ్నల్ వద్ద ఆగగా, పక్కన నుంచి మంచినీటి ట్యాంకర్ ఢీకొట్టింది. రాజ్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
నల్లకుంట: ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్‌లో దూసుకువచ్చి ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మృతికి కారణమైన బ్యాంక్ ఉద్యోగిని నల్లకుంట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం పోలీస్ స్టేషన్‌లో ఓయూ ఏసీపీ జగన్ వివరాలు వెల్లడించారు. ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీఈ చదువుతున్న పాతబస్తీకి చెందిన షేక్ అయేషా ముస్ఫిరా (21) ఈ నెల 9న తండ్రి మహ్మద్ ఆరిఫ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై కళాశాలకు వెళుతోంది. ఫీవర్ ఆసుపత్రి షైలా కేఫ్ వద్ద శివం రోడ్డుకు చెందిన కోఠి ఎస్‌బీఐ బీఎం ధర్మరాజు (44) రాంగ్ రూట్‌లో ద్విచక్ర వాహనంపై దూసుకువచ్చి ఆరిఫ్ వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో అయేషా ముస్ఫిరా కుడివైపు పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడిపోయిన అయేషా తల ఛిద్రం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన ధర్మరాజును అదుపులోకి తీసుకున్న నల్లకుంట పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఆర్టీసీ డ్రైవర్ బి. సురేష్ బాబు (58)ను ఏ2గా చేర్చి నిర్లక్ష్యంగా బస్సు నడిపినందుకు నోటీసులు జారీ చేశారు.


