● ఉపాధి కోసం తీసుకొచ్చి కడతేర్చిన భర్త
● పోలీసుల అదుపులో నిందితుడు
● బిక్కుబిక్కుమంటున్న ముగ్గురు చిన్నారులు
ఇబ్రహీంపట్నం రూరల్: పొట్టకూటి కోసం భార్యాపిల్లలను తీసుకొచ్చాడు.. అప్పటికే భార్యపై అనుమానం పెంచుకున్నాడు.. సమయం చూసి మెడకు చున్నీ చుట్టి అంతమొందించాడు.. ఈ ఘటన ఆదిభట్ల పోలిస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం నబరంగ్‌పూర్ జిల్లా, హలదిఖల్లియాపడ్ గ్రామానికి చెందిన గణేశ్యం పూజారి (33), భార్య ఉనితా పూజారి (32)తో పాటు ముగ్గురు చిన్నారులతో కలిసి నాలుగు రోజుల క్రితం కొంగరకలాన్‌లోని ఇటుక బట్టీలో పనికోసం వచ్చారు. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో బట్టీ సూపర్ వైజర్ గణేశ్యం పూజారి గదిలో లేకపోవడాన్ని గమనించాడు. పక్క గదిలో ఉండే కూలీలను ఆరా తీయగా దంపతులు నీళ్ల బకెట్ తీసుకొని బయటకు వెళ్లారని తెలిపారు. ఉనితా పూజారి బహిర్భూమికి వెళ్లగా భర్త వెంట వెళ్లాడు. చున్నీతో ఆమె గొంతు నులిమి హతమార్చాడు. కొద్ది సేపటికి గణేశ్యం ఒక్కడే తిరిగి రావడం.. మళ్లీ దుప్పటి తీసుకొని బయటకు వెళ్లి రావడం గమనించి సూపర్ వైజర్‌కు అనుమానం వచ్చింది. దీంతో అతడిని నిలదీయగా తమ స్వగ్రామంలో వేరొకరితో వివాహేతర సంబంధం ఉందని, అనుమానంతో ఆమెను హత్య చేయాలని ఉద్దేశంతో ఉపాధిపేరుతో తీసుకొచ్చినట్లు తెలిపాడు. సూపర్‌వైజర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి, సీఐ రమేష్ వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గణేశ్యం పూజారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తల్లి చనిపోవడం, తండ్రి పోలీసుల అదుపులో ఉండడంతో ముగ్గురు పిల్లలు బిక్కుబిక్కుమంటున్నారు. ఒడిశా నుంచి కుటుంబ సభ్యులను రప్పించి వారికి అప్పజెప్పినట్లు సమాచారం.


