నవాబుపేట మండలంలోని ఏడు గ్రామాలు రైల్వే ట్రాక్‌కు అవతలి వైపున ఉంటాయి. మండలంలో సుమారు 25 కిలోమీటర్ల మేర ట్రాక్ ఉంటుంది. దీనికి సమీపంలో 20 కిలోమీటర్ల మేర మూసీ నది ప్రవహిస్తుంది. మండలాన్ని రైల్వే ట్రాక్, మూసీనది రెండుగా చీల్చుతుంది. దీంతో ఏడు గ్రామాల ప్రజలు అవతలి నుంచి ఇవతలికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ట్రాక్ దాటాలంటే గొల్లగూడ వరకు రావాల్సిందే. చాలా గ్రామాల వద్ద చిన్న బ్రిడ్జిలు మాత్రమే ఉండటం వాటి కింద వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ముబారక్‌పూర్, ఎల్లకొండ, గొల్లగూడ, పులుమామిడి, లింగంపల్లి, నారెగూడ, అక్నాపూర్, చిట్టిగిద్ద రైల్వేస్టేషన్, చించల్‌పేట, గేట్‌వనంపల్లి గ్రామాల ప్రజలు చిన్న బ్రిడ్జిల కారణంగా అవస్థలు పడుతున్నారు. వీటి స్థానంలో పెద్ద వంతెనలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.


