అనంతగిరి: పిల్లల పెంపకంలో జెండర్ అసమానతలు మంచిది కాదని.. ఆడ, మగ అనే తేడా లేకుండా సమాన అవకాశాలు కల్పించాలని జెడ్పీ సీఈఓ సుధీర్ తల్లిదండ్రులకు సూచించారు. మంగళవారం వికారాబాద్ ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో జెండర్ సమానత్వంపై ఎంవీఎఫ్ ఆధ్వర్యంలో సర్పంచులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామాల్లో సర్పంచులు ఈ విషయంపై ప్రత్యేక చొరవ తీసుకొని బాల్యవివాహాల నిర్మూలనకు బాటలు వేయాలన్నారు. బాలల హక్కుల రక్షణ బాధ్యతలు గ్రామ పంచాయతీలు తీసుకోవాలని సూచించారు. అమ్మాయిలను ఉన్నత విద్య అభ్యసించే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. విద్యతోనే ఏదైనా సాధ్యమన్నారు. పిల్లలను జెండర్ అసమానతలు లేకుండా పెంచాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వినయ్ కుమార్, ఎంపీఓ శ్రీకాంత్, సీడబ్ల్యూసీ సభ్యులు సంగమేశ్వర్, ఎంవీఎఫ్ కోఆర్డినేటర్ భాస్కర్, శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు, ఎంవీఎఫ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ సీఈఓ సుధీర్


