● విచారణ జరిపి న్యాయం చేయండి
● సివిల్ సప్లయ్ కమిషనర్‌కు బాధితుల ఫిర్యాదు
చేవెళ్ల: రేషన్ డీలర్ల నియామకంలో అర్హులైన వారికి అన్యాయం జరిగిందని నాలుగు గ్రామాలకు చెందిన అభ్యర్థులు, పరీక్షలు రాసిన బాధితులు మంగళవారం సివిల్‌సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేవెళ్ల డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో జరిగిన రేషన్ డీలర్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని, దీనిపై తగిన విచారణ చేసి, న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై పలుమార్లు ప్రజావాణి కార్యక్రమాల్లో కలెక్టర్, ఆర్డీఓకు సైతం ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆర్టీఏ చట్టం కింద నియామకంలో అభ్యర్థుల మార్కులు, ఇంటర్వ్యూల మార్కుల మెరిట్ లిస్టులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పైరవీలు చేసిన వారినే నియమించి, అర్హులను వదిలేశారని ఆరోపించారు. కౌకుంట్ల, గుండాల, చిన్నమంగళారం, వెంకటాపూరం గ్రామాలకు చెందిన బాధిత అభ్యర్థులు శ్రీనివాస్, సౌజన్య, సాయికుమార్, ప్రభులింగం, సత్యనారాయణగౌడ్, కృష్ణగౌడ్ తదితరులు కమిషనర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.


