శివ మయం.. కార్తీక మాసం | - | Sakshi
Sakshi News home page

శివ మయం.. కార్తీక మాసం

Nov 11 2026 9:22 AM | Updated on Nov 11 2026 9:22 AM

కార్తీక మాస పూజలు

ఎంతో పవిత్రమైనది

కొడంగల్‌ రూరల్‌: కార్తీకమాసం చాలా విశిష్ట మాసం. ఈ నెలలో చేసే ప్రతి పూజ, ప్రతి చర్య చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. వ్రతాలు, నోములు, కార్తీక స్నానం, కార్తీక దీపం తదితర కార్యక్రమాలతో మహా పుణ్యఫలం సిద్ధిస్తుందని ప్రజల నమ్మకం. రోజూ కార్తీక పురాణం పఠించడంతో శివానుగ్రహం పొందవచ్చని పురోహితులు చెబుతారు. కార్తీక వన భోజనానికి ఓ ప్రత్యేకత ఉంది. సోమవారం చాలా విశేషమైన రోజు. ఈ రోజున ప్రాతఃకాలంలో లేచి నదీ స్నానం లేదా గంగాస్నానం చేస్తే సకల పాపాలు పోతేయనే నమ్మకం. కార్తీక సోమవారం శివునికి చాలా ప్రీతిపాత్రమైన రోజు. ప్రతి సోమవారం ఉపవాసం పాటించి శివలింగానికి రుద్రాభిషేకం చేస్తే శివానుగ్రహం కలుగుతుంది. శివాలయంలో సాయంత్రం దీపారాధన చేయడంతో మహా పుణ్యఫలం లభిస్తుంది. దానం చేయడం, కార్తీక పురాణం చదవడం శుభదాయకం. లింగాష్టకం, బిల్వాష్టకం, శివ పంచాక్షరీ జపం, శివ స్త్రోత్ర పారాయణం చేయడం సకల పాపహరం. సూర్యోదయ సమయంలో నదీస్నానం, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మంచి కలుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఉపవాసం పాటించి శ్రీమహావిష్ణువును పూజించి తులసి దళాలతో అర్చన చేయాలి. కార్తీక ద్వాదశి రోజున తులసీ పూజ, తులసీ వివాహం, రాధా కార్తీక దామోదర పూజ చేయడంతో సకల పుణ్యఫలం కలుగుతుంది. తులసీ బృందావనం వద్ద దీపారాధన చేయడం సకల పాపహరం, వైకుంఠ చతుర్దశి రోజున విష్ణు ఆలయంలో దీపారాధన, పురుష సూక్త అభిషేకం, విష్ణు సహస్త్ర నామ స్త్రోత్ర పారాయణం చేయడం ఉత్తమం. కార్తీక మాసం పౌర్ణమి రోజున మహా పర్వదినంగా భావిస్తూ శివునికి అభిషేకం, గౌరీ నోములు, కేదారేశ్వరీ వ్రతం, శివ పార్వతి కల్యాణం, పవిత్ర నదీ స్నానం, సత్యనారాయణ స్వామి వ్రతం, కార్తీక లక్ష దీపోత్సవం, వన భోజనం, అఖండ భజన, అన్నదానం చేయడంతో సకల దోషాలు, పాపాలు, గ్రహ పీడలు నివారణ జరుగుతుందని హితోక్తి. కార్తీక బహుళ చతుర్దశి మాస శివరాత్రి రోజున శివలింగానికి రుద్రాభిషేకం, జాగరణతో భజనలు చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది. కార్తీకమాసంలో వన భోజనం చేయడం పుణ్యమైన కార్యం. ఏదైనా వనంగాని, తోటలోగాని, సామూహికంగా ఉసిరి చెట్టును పూజించి పిండి వంటలు వండి దామోదర స్వామికి నైవేద్యం సమర్పించి బందువులు – మిత్రులతో కలిసి వన భోజనం చేయడం వలన శివ కేశవ అనుగ్రహం కలుగుతుంది. కార్తీక మాసంలో అన్నదానం మహాదానం అవుతుంది.

వ్రతాలు, నోములు, ప్రత్యేక పూజలకు ప్రసిద్ధి

ధారూరు: మండలంలోని పలు ఆలయాల్లో మంగళవారం కార్తీక మాసం పూజలను ఘనంగా నిర్వహించారు. రాత్రి ఇళ్ల ముందు మహిళలు తులసిచెట్ల వద్ద ఉసిరికాయ దీపాలు వెలిగించారు. ధారూరులోని వీరభద్రేశ్వరస్వామి ఆలయంలో కపిలేశ్వరస్వామికి క్షీరాభిషేకం, జలాభిషేకం చేశారు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు.

కార్తీకమాసంలో వచ్చే పండుగలు, పర్వదినాలు, నోములు, ప్రాతఃకాల స్నానం, కార్తీక పురాణం చదవడం, ఆలయాల్లో దీపాలు వెలిగించడం అత్యంత ప్రీతి దాయకం. శివలింగానికి పంచామృతంతో రుద్రాభిషేకం చేయడం, శివుడు, విష్ణువు ఆలయాల్లో పూజలు చేస్తూ దీపాలు వెలిగించడంతో సకల పాపాలు నశించి అనేక శుభాలు కలిగి శివానుగ్రహం పొందుతారు.

– కిట్టుస్వామి, పట్టణ పురోహితులు, గాడిబాయి శివాలయ అర్చకులు, కొడంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement