మేడ్చల్‌లో జ్యువెలరీ
దుకాణంలో చోరీ
మేడ్చల్‌రూరల్: మేడ్చల్ పట్టణంలో భారీ చోరీ జరిగింది. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఓ జ్యువెలరీ దుకాణం గోడకు అర్ధరాత్రి కన్నంవేసి చొరబడిన దొంగలు 8 కిలోల వెండి ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని జగదాంబ జ్యువెలరీ దుకాణంలో యజమాని శేషమాల్ చౌదరి కుటుంబీకులు ఆదివారం రాత్రి దీపావళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం అమావాస్య కావడంతో దుకాణం తెరవలేదు. మంగళవారం ఉదయం యజమాని కుమారుడు అజయ్ చౌదరి దుకాణం తెరచి చూడగా దుకాణంలో ఆభరణాలు చిందరవందరగా పడి ఉండడం, వెనుక భాగం వైపు గోడకు కన్నం కనిపించడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో పక్కనే ఉన్న మేడ్చల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం పలు ఆధారాలు సేకరించారు. దుకాణంలో ఉన్న సుమారు 8 కిలోలకు పైగా వెండి ఆభరణాలు, కొంత నగదు అపహరణకు గురైనట్లు యజమాని శేషమాల్ తెలిపారు. జ్యువెలరీ షాప్‌ను మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డితో కలిసి సందర్శించి దొంగతనం తీరు పరిశీలించారు. దుండగులు రెక్కి నిర్వహించి సోమవారం అర్ధరాత్రి దొంగతనానికి పాల్పడినట్లు ఏసీపీ తెలిపారు. దుకాణంలోని బంగారు ఆభరణాలు లాకర్‌లో భద్రంగా ఉన్నాయని కొన్ని వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయని తెలిపారు. దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. కాగా పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్నప్పటికి గతంలోనూ దుండగులు దుకాణంలో చోరీ జరగడం ఇది రెండవసారి కావడం గమనార్హం.
8 కిలోలపైగా వెండి ఆభరణాలు, నగదు అపహరణ
పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఘటన


