● కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని వక్తల డిమాండ్
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఓయూ నాన్‌టీచింగ్ స్టాఫ్ జేఏసీ ఆధ్వర్యంలో గత నెల 23 నుంచి జరుగుతున్న సమ్మెలో భాగంగా మంగళవారం వర్సిటీ పాలన భవనం ఎదుట ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. కార్యక్రమానికి ఉద్యోగుల జేఏసీ చైర్మన్ డా.కుమార్, అధ్యక్షులు ఖదీర్‌ఖాన్ అధ్యక్షత వహించగా వివిధ పార్టీలు, సంఘాల నేతలు పాల్గొని సంఘీభావం తెలిపి ప్రసంగించారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్యోగాలను పర్మనెంట్ చేయకపోవడం బాధకరమన్నారు. అవసరమైతే తానే స్వయంగా ఉన్నతాధికారులు, సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ నేత డా.వరంగల్ రవి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అధినేత్రి కవిత మాట్లాడుతూ.. ఓయూ ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ స్పందించాలని, సీఎం ప్రకటించిన రూ.1000 కోట్లను విడుదల చేయాలని, ఔటా అధ్యక్షులు ప్రొ.మనోహర్ పై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సామాజికవేత్త ప్రొ.హరగోపాల్ ఫోన్ ద్వారా తన సందేశాన్ని వినిపించారు. కార్యక్రమంలో టీకేడీ నేత డా.పృథ్వీరాజ్, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, సీసీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐఎంఎల్ (మాస్ లైన్) నేత పొటు రంగారావు, కార్మికనేత ఎస్‌ఎల్ పద్మ, సీఐటీయూ నేత మహేందర్, డీవైఎఫ్‌ఐ నేత డా.ఆర్‌ఎల్ మూర్తి, తెలంగాణ వర్సిటీస్ కాంట్రాక్టు టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డా.పరుశురామ్, కార్యనిర్వహక అధ్యక్షులు డా.ధర్మతేజ, డా.మోడం రవి పాల్గొన్నారు.


