తాండూరు: కొడంగల్ తరహాలోనే సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలోని మరో మూడు నియోజవకర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్ డిమాండ్ చేశారు. జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉన్నప్పుడు అభివృద్ధిని ఒకే ప్రాంతానికే పరిమితం చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యేలు స్థానిక సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారా అనే అనుమానం వస్తోందన్నారు. తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో వైద్యులు, వైద్య నిపుణులు, సిబ్బంది కొరత కారణంగా రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పరికరాలు సమకూర్చినా వాటిని పూర్తి స్థాయిలో వినియోగించ లేకపోవడం విచారకరమన్నారు. తాండూరు, వికారాబాద్, పరిగి ప్రాంతాల్లో ఉన్న సహజ వనరులపై ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడిందన్నారు. నాపరాయి, ఇసుక, ఎర్రమట్టి అక్రమంగా తరలిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాయల్టీ చెల్లించకుండా ఎర్రమట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.


