హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ | - | Sakshi
Sakshi News home page

హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌

Nov 10 2026 8:21 AM | Updated on Nov 10 2026 8:21 AM

చేవెళ్ల: ఒకేసారి 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఈ సంఘటన చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి నర్సింగ్‌ కళాశాల హాస్టల్‌లో చోటుచేసుకుంది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగ్‌ కళాశాల హాస్టల్‌లో దాదాపు 80 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి శనివారం రాత్రి చికెన్‌ వండిపెట్టారు. అది తిన్న విద్యార్థుల్లో 16 మందికి అదేరోజు రాత్రి మరి కొంత మందికి ఆదివారం ఉదయం వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వారందరికీ అదే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని, సోమవారం అందరూ డిశ్చార్జి అయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నర్సింగ్‌ కళాశాలలోని కొంతమంది కేరళకు చెందిన విద్యార్థినులు గంజిలో చట్నీ కలుపుకొని తాగడంతోనే ఇలా జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థులు మాత్రం ఉదయం వండిన చికెన్‌ సాయంత్రం తిన్నామని అందుకే ఇలా జరిగిందని చెబుతున్నారు. కాగా విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. స్థానికంగా తెలిసిన వారిని పంపించి క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. కొంతమంది నేరుగా వచ్చి తమపిల్లల పరిస్థితిపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించటంలేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి కళ్యాణ్‌ చక్రవర్తి, ఏఓ షఫీయొద్దీన్‌తో కలిసి ఆదివారం రాత్రి ఆస్పత్రిని సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌ వంట గది, వంట సామగ్రిని స్వయంగా పరిశీలించారు. పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు తెలిపారు.

16 మంది నర్సింగ్‌ విద్యార్థులకు అస్వస్థత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement