అనంతగిరి: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే పండుగకు విశిష్టమైన ప్రాధాన్యత ఉందని తెలిపారు. దీపావళి కాంతులు ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలని, ప్రజల జీవితాలు ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, శాంతిసౌభాగ్యాలతో వెల్లివిరియాలని స్పీకర్ ఆకాంక్షించారు. అందరూ పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నారు.
కేశంపేట: మండల పరిఽధిలోని పాపిరెడ్డిగూడ శివారు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలివీ.. పోలీసులు శుక్రవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పాపిరెడ్డిగూడ శివారు నుంచి మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ను గుర్తించారు. ఆపి మట్టి తరలింపునకు సంబంధించిన వివరాలు అడగ్గా ఎలాంటి అనుమతి లేదని తెలిసింది. దీంతో టిప్పర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. టిప్పర్ డ్రైవర్ శ్రీశైలం, యజమాని సంతోష్‌పై పెట్రోలింగ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాస్ తెలిపారు.
పహాడీషరీఫ్: కార్మికుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రతాప్‌చంద్ర జేనా (48) తుక్కుగూడలోని రుబ్రీ తులీప్ లేబర్ కంపెనీలో కార్మికుడిగా పని చేసేందుకు ఈ నెల 3న వలస వచ్చాడు. పని నిమిత్తం బయటికి వెళ్లి వస్తానని అదే కంపెనీలో పనిచేసే తమ ప్రాంత వాసి భూషణ్ జేనాకు చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. అతని ఆచూకీ కోసం స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడంతో భూషణ్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
చేవెళ్ల: వీధి కుక్కల దాడిలో కొండగొర్రె (చౌసింగా) మృతి చెందింది. అల్లవాడ గ్రామ సమీపంలోని పొలాల వద్ద శనివారం కుక్కల దాడిలో చనిపోయి కనిపించింది. స్థానికులు గుర్తించి జింక అనుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఫారెస్ట్ రేంజ్ అధికారి రవికుమార్ సిబ్బందితో వచ్చి పరిశీలించారు. అది జింక కాదని అడవుల్లో ఉండే కొండగొర్రె (చౌసింగా) అని పిలుస్తారని తెలిపారు. దారి తప్పి గ్రామాల వైపువచ్చి ఉంటుందన్నారు. పంచనామా చేసి తీసుకెళ్లి పూడ్చిపెట్టారు.
మహేశ్వరం: విద్యుత్ కోతలు, ఎల్‌నినో ప్రభావంతో ఎండిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సామేల్ డిమాండ్ చేశారు. కందుకూరులో శనివారం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు లేక రైతులు సాగు చేసిన పంటలు ఎండుముఖం పట్టి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండిన పంటలను గుర్తించి ఎకరాకు రూ.20వేల ఆర్థిక సహాయంతో పాటు రుణాలు అందించాలన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలని, పాడి రైతులకు రుణా లు ఇవ్వాలని, సబ్సిడీపై పశుగ్రాసం అందించాలని కోరారు. రైతులు బోర్లు వేసుకునేందుకు, బావులు తవ్వుకునేందుకు సబ్సిడీ రుణాలు అందించి ప్రోత్సహించాలన్నారు. విత్తనాలు ప్రభుత్వమే పంపిణీ చేయాలన్నారు. ఈ నెల 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే ఆలిండియా మహా సభలకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు దుబ్బాక రాంచందర్, మండల కార్యదర్శి బుట్టి బాల్‌రాజ్, కార్యవర్గ సభ్యులు బుడ్డిరావు శ్రీనివాస్, నర్సింహ, కృష్ణ, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.


