బియ్యం ధరలకు కళ్లెం | - | Sakshi
Sakshi News home page

బియ్యం ధరలకు కళ్లెం

Nov 8 2026 10:24 AM | Updated on Nov 8 2026 10:24 AM

అదుపునకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రత్యేక విక్రయ కేంద్రాలకు శ్రీకారం కర్మన్‌ఘాట్‌లో ఇప్పటికే రెండు ఔట్‌లెట్లు ప్రారంభం మరిన్ని ఏర్పాటు చేసేందుకుసివిల్‌ సప్లయ్‌ ప్రతిపాదనలు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: పెరుగుతున్న బియ్యం ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టింది. సామాన్య ప్రజలకు సరసమైన ధరలకే సరఫరా చేసేందుకు ఇప్పటికే కొనసాగుతున్న సాధారణ హోల్‌సేల్‌, రిటైల్‌ బియ్యం విక్రయ దుకాణాలకు అదనంగా ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ప్రతి కేంద్రంలో బియ్యం రకాలు, విక్రయ ధరలు, నిల్వల వివరాలను స్పష్టంగా ప్రదర్శించే విధంగా చర్యలు చేపడుతోంది. సరూర్‌నగర్‌ మండలం కర్మన్‌ఘాట్‌లో శనివారం రెండు ఔట్‌లెట్లను జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి వనజాత ప్రారంభించారు. త్వరలో ఈ సేవలను కొత్తపేట, ఎల్బీనగర్‌ సహా జిల్లాలోని ఇతర ప్రాంతాలకు విస్తరింపజేయనున్నట్లు ప్రకటించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి సాగువిస్తీర్ణం తగ్గడంతో పాటు ఆశించిన పంట దిగుబడి కూడా రాలేదు. కొంతమంది వ్యాపారులు దీన్ని అవకాశంగా తీసుకుని కృత్రిమ బియ్యం కొరతను సృష్టించేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న నిల్వలను బ్లాక్‌మార్కెట్‌కు తరలించి ధరల పెరుగుదలకు కారణమవుతున్నారు. ప్రభుత్వం పేదలకు సరఫరా చేస్తున్న సన్న బియ్యాన్ని దొడ్డిదారిలో సమీప రైస్‌ మిల్లులకు చేర్చి గుట్టుగా బ్రాండెడ్‌ బ్యాగుల్లో నింపుతున్నారు. మంచాల, ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఇప్పటికే పలు మిల్లుల్లోని అక్రమాలు బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తూకాల్లో మోసాలకు పాల్పడుతుండటంతో పాటు జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్న మిల్లర్లు, వ్యాపారులను గుర్తించి ఇప్పటికే వారిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో సామాన్యులకు నాణ్యమైన బియ్యం తక్కువ ధరకే అందించాలని రైస్‌ ఔట్‌లెట్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో ధరలు అదుపులో ఉండటంతో పాటు బియ్యం బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా ఉంటుందని భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement