శంకర్పల్లి: చిట్టీల పేరుతో జనాలను మోసం చేసి రూ.4కోట్లు కాజేసి పరారైన వ్యక్తిని శంకర్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారు. సీఐ రుధ్వీర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లికి చెందిన గుడిశెట్టి సుధాకర్ (50), లక్ష్మి (42) దంపతులు. 2021 నుంచి 2024 వరకు చిట్టీల వ్యాపారం చేశారు. ఆకర్షణీయమైన వడ్డీలు, అధిక లాభాలు ఆశ చూపించారు. దీంతో చాలామంది రూ.లక్షల్లో డబ్బులు కట్టారు. పెద్ద ఎత్తున డబ్బు సమకూరడంతో సుధాకర్ దంపతులు రూ.4 కోట్లతో 2024 జూన్లో పరారయ్యారు. మోసపోయినట్లు తెలుసుకున్న 48 మంది బాధితులు శంకర్పల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని గురువారం అరెస్టు చేశారు. చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టి, రిమాండ్ నిమిత్తం సంగారెడ్డి జిల్లా కంది జైలుకి తరలించారు.
● రూ.4కోట్లు వసూలు చేసి పరార్
● పోలీసులకు చిక్కిన నిందితుడు
● రిమాండ్కు తరలింపు


