‘రీ అవార్డు’ పరిశీలన | - | Sakshi
Sakshi News home page

‘రీ అవార్డు’ పరిశీలన

Nov 7 2026 10:05 AM | Updated on Nov 7 2026 10:05 AM

వెంకటాపూర్‌

రిజర్వాయర్‌కు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘మాడ్గుల మండలం వెంకటాపురం రిజర్వాయర్‌ భూసేకరణ (1056 ఎకరాల)కు సంబంధించిన అవార్డు 2020లోనే జారీ చేసినప్పటికీ నిధుల చెల్లింపులు జరగకపోవడంతో ప్రస్తుత పరిహారం విషయంలో వ్యత్యాసం ఏర్పడింది. రిజర్వాయర్‌ భూ సేకరణ అంశం తెరపైకి తీసుకొచ్చి ఆరేళ్లు గడిచిన నేపథ్యంలో ఆయా భూ యజమానులతో మళ్లీ చర్చలు జరిపి, నిబంధనల ప్రకారం రీ–అవార్డు జారీ చేసే అంశాన్ని పరిశీలించాల్సి ఉంది’ అని కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు సచివాలయం నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు అదనపు కలెక్టర్‌ కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి శారదాదేవి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేశ్‌ మోహన్‌, డీఆర్‌డీఏ పీడీ శ్రీలత, మిషన్‌ భగీరథ ఈఈ రాజేశ్వర్‌ రావు, హౌసింగ్‌ పీడీ చాంప్లా నాయక్‌, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లుతో కలిసి హాజరయ్యారు. మొండిగౌరెల్లికి సంబంధించిన భూసేకరణ కేసులో ఇటీవల అవార్డు జారీ చేశామని, పరిహారం చెల్లింపుల ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్‌ వెల్లడించారు. మిగిలిన పీజేఏసీకి సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.

సమన్వయంతో ముందుకెళ్లాలి

విద్య, వైద్యం, గృహ నిర్మాణం, తాగునీటి సరఫరా శాఖల పనితీరును అధికారులు ప్రతివారం సమీక్షిస్తూ, లక్ష్యాల సాధనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతి అధికారి తన పరిధిలోని క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రతిరోజూ సమన్వయం చేసుకుంటూ నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన చోట రెగ్యులర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి పనుల పురోగతిని పర్యవేక్షించాలన్నారు. హౌసింగ్‌, విద్యాశాఖల్లో ముందస్తు ప్రణాళికతో పని చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల అర్బన్‌, రూరల్‌ బిల్లుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వీబీజీరామ్‌జీ పనులను రోజువారీగా సమీక్షించాలని, ఏపీవోలతో నిరంతరం మాట్లాడి లక్ష్యాలను సాధించాలన్నారు. వచ్చే వారపు సమీక్ష నాటికి ఏ శాఖలోనూ పనులు ఆలస్యం కాకుండా అధికారులు బాధ్యతతో పని చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించకుండా, సమర్థవంతంగా పనిచేస్తూ జిల్లా ప్రగతికి కృషి చేయాలని, అవసరమైన సహకారాన్ని జిల్లా యంత్రాంగం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

రంగారెడ్డి కలెక్టర్‌ నారాయణరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement