రైతులకు అండగా నిలవండి | - | Sakshi
Sakshi News home page

రైతులకు అండగా నిలవండి

Nov 7 2026 10:05 AM | Updated on Nov 7 2026 10:05 AM

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘కరువు ప్రభావిత రైతులకు బ్యాంకులు ఆర్థికంగా అండగా నిలవాలి. రుణ వసూళ్ల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. కరువు పరిస్థితుల్లో వారికి అండగా నిలవాలి’ అని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ కిరణ్మయి బ్యాంకర్లకు సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ప్రత్యేక జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ) సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.03 (24–10–2026) ప్రకారం ఆర్బీఐ మార్గదర్శకాలు, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) తీర్మానాలను బ్యాంకులు అమలు చేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం 18 మండలాలను కరువు ప్రభావిత మండలాలుగా గుర్తించగా, వాటిలో ఐదు తీవ్ర కరువు ప్రభావిత, 13 మధ్యస్థ కరువు ప్రభావిత మండ లాలు ఉన్నాయని తెలిపారు. మధ్యస్థ కరువు ప్రభావిత మండలాల్లో అర్హులైన రైతులకు 12 నెలల మారటోరియంతో పాటు తదుపరి 24 నెలల వరకు, తీవ్ర కరువు ప్రభావిత మండలాల్లో 12 నెలల మారటోరియంతో పాటు తదుపరి 48 నెలల వరకు రుణాల చెల్లింపు గడువు కల్పించే విధానాన్ని వివరించారు. లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ సుశీల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. బ్యాంకర్లు అర్హులైన రైతులను గుర్తించి, రుణ పునర్వ్యవస్థీకరణ ప్రయోజనాలపై అవగా హన కల్పించాలని, అవసరమైన కొత్త రుణాలను సకాలంలో అందించాలని కోరారు. ఆర్బీఐ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌ రుణాల పునర్వ్యవస్థీకరణ విధానం, అర్హతలు, అమలు ప్రక్రియను వివరించగా, నాబార్డ్‌ జిల్లా అభివృద్ధి మేనేజర్‌ హర్ష రైతులకు అందించాల్సిన రుణ ఉపశమన చర్యలను వివరించారు. పంటల బీమా పరిహారం అందే వరకు వేచి చూడకుండా అర్హత మేరకు అదనపు ఆర్థిక సహాయం, తాజా రుణాలు అందించాలని సూచించారు. సమావేశంలో సుశీల్‌ కుమార్‌, అన్ని బ్యాంకుల ప్రతినిధులు, డీఆర్‌డీఏ పీడీ శ్రీలత, మెప్మా పీడీ వెంకటనారాయణ, వ్యవసాయ శాఖ అధికారి సుజాత తదితరులు పాల్గొన్నారు.

రుణ వసూళ్లలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి

బ్యాంకర్లకు రంగారెడ్డి అదనపు కలెక్టర్‌ కిరణ్మయి సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement