యాచారం: ఆగ్రో ఫారెస్ట్రీ పంటల సాగుపై రైతులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సురేష్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆగ్రో ఫారెస్ట్రీ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. వేప, చింత, ఇప్ప, కుంకుడు, మునగ వంటి పంటలతో దీర్ఘకాలికంగా ఆదాయం పొందొచ్చని సూచించారు. నేల ప్రభావం, నీటి లభ్యతను బట్టి పంటలను సాగు చేస్తే గణనీయమైన లాభాలు పొందొచ్చని పేర్కొన్నారు. కుంకుడు, వేప, మునగ, ఆకులు, కాయల ద్వారా ఇతర ఉత్పత్తుల్లో వాడుకోవడం జరుగుతుందన్నారు. రైతులు వ్యవసాయ పొలాల గట్లు, రోడ్ల పక్కన చెట్లు పెంచాలని సూచించారు. ఆగ్రో ఫారెస్ట్రీ పంటల ద్వారా నేల కోతను నివారించడంతో పాటు భూసారాన్ని మెరుగు పర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏడీహెచ్ అరుణ, ఇబ్రహీంపట్నం డివిజన్ ఉద్యాన శాఖ అఽధికారి నవీన, మండల వ్యవసాయాధికారి రవినాథ్, పలు గ్రామాలు రైతులు పాల్గొన్నారు.


