ఇబ్రహీంపట్నం రూరల్: కొంగరకలాన్ నుంచి డంపింగ్ యార్డును తరలించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొత్త అశోక్‌గౌడ్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా గురువారం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన చెత్తబండ్లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అశోక్‌గౌడ్ మాట్లాడుతూ.. ఆదిభట్ల మున్సిపాలిటీ ఏర్పాటు చేసినప్పుడు డంపింగ్ యార్డు నిర్మించారని, అప్పట్లో కేవలం ఆదిభట్ల మున్సిపాలిటీ నుంచి మాత్రమే చెత్త సేకరించి వేసేవారని తెలిపారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన చెత్తను వేస్తున్నారన్నారు. కొన్నేళ్లుగా చెత్త వేయడంతో పెద్ద డంప్‌గా మారిందన్నారు. కొంత కాలంగా నిప్పు పెడతుండడంతొ కొంగరకలాన్ తండా, కొంగరకలాన్ మొత్తం పొగ వ్యాప్తి చెందుతోందన్నారు. రాత్రిపూట దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తడి, పొడి చెత్త వేరు చేసి ఎరువులు తయారు చేయకుండా ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం తగదన్నారు. ప్రజలకు ఇబ్బందిగా మారిన డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని, అప్పటివరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి విన్నవించారు. అదనపు కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోరెడ్డి నర్సింహారెడ్డి, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు జక్క రవీందర్‌రెడ్డి, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నాయకులు బోసుపల్లి ప్రతాప్, నారాయణ యాదవ్, నర్సింహగౌడ్, నర్సింహారెడ్డి, బచ్చిగళ్ల రమేష్, పురుషోత్తం, లక్ష్మీపతిగౌడ్, వీరస్వామిగౌడ్, గజ్జెల నర్సింహారెడ్డి, రాఘవేందర్, కిషన్‌నాయక్, యాదయ్యగౌడ్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు
బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన
చెత్త బండ్లను అడ్డుకొని ధర్నా


