కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం లాల్‌పహాడ్‌లో గురువారం ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ దుకాణంలో రూ.4 లక్షల విలువైన బాణసంచా పట్టుకున్నట్లు తెలిసింది. షాద్‌నగర్ పట్టణానికి చెందిన అనిల్ రెడ్డికి సంబంధించిన దుకాణంలో అనుమతులు లేకుండా విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు దుఖాణంలో తనిఖీలు నిర్వహించి క్రాకర్స్‌ను స్వాధీనం చేసుకొని చౌదరిగూడ పోలీసులకు అప్పగించారు.
లైంగిక దాడి నిందితుడికి జీవిత ఖైదు
సిటీ కోర్టులు: పన్నెండేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదుతోపాటు రూ.4 వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మెదక్ జిల్లా, పెద్దశంకరంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాధితురాలి కుటుంబం ఎనిమిదేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా దొంతనపల్లికి వలస వచ్చింది. ఇదిలా ఉండగా తాము కూలీ పనులకు వెళ్లిన సమయంలో 12, ఆగష్టు, 2021 రోజున హెన్కపల్లికి చెందిన నర్సింగ్‌రావు (42) తమ కూతురుపై లైంగికదాడికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి శంకర్పల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి, రంగారెడ్డి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ భిక్షపతిగౌడ్ వాదనలు వినిపించగా, నిందితుడు నేరానికి పాల్పడినట్లు రుజువు కావడంతో న్యాయ స్థానం పైతీర్పును వెల్లడించింది.


