వికారాబాద్: ఖరీఫ్ సీజన్ వరి పంట కొనుగోలుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం పంట చేతికి రావడంతో విక్రయించే ఏర్పాట్లలో రైతులు ఉన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో వరి సాగు కాస్త తగ్గింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సాగు విస్తీర్ణం, దిగుబడిని అంచనా వేసి కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. గతేడాది 125 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించగా ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గినందున వంద కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సన్న రకం వడ్ల కొనుగోలుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు భారీగా ఉండటంతో మంచి ధర వస్తుందని రైతులు ఆశగా ఉన్నారు. అయితే కొనుగోలు కేంద్రాలకు సన్నరకం వడ్లు వచ్చే అవకాశం తక్కుగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
మద్దతు ధర రూ.2,461
కేంద్ర ప్రభుత్వం క్వింటాలు ఏ గ్రేడ్ వడ్లకు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 మద్దతు ధర ప్రకటించింది. అయితే తామే ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 1.04లక్షల ఎకరాల్లో వరి పంట వేయగా 2లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసి వంద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నందున ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 15 వేల ఎకరాల్లో సన్న రకం సాగు చేశారు. బహిరంగ మార్కెట్‌లో బియ్యానికి మంచి డిమాండ్ ఉండటంతో ఎక్కువ మంది రైతులు బయటే విక్రయించే అవకాశం ఉంది.
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
నాలుగు ఏజెన్సీల ద్వారా కొనుగోళ్లు
సన్నరకం వడ్లకు ప్రత్యేక కౌంటర్లు
జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 1.04లక్షల ఎకరాలు
దిగుబడి అంచనా 2లక్షల మెట్రిక్ టన్నులు
ఏర్పాట్లు చేస్తున్నాం
ధాన్యం సేకరణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం. తాలు, తేమ, మట్టి పెల్లలు లేకుండా తేవాలని రైతులకు సూచిస్తున్నాం. పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.
– వెంకటాచారి, అడిషనల్ కలెక్టర్


