దోమ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్జేడీ) సోమిరెడ్డి సూచించారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల చదువు, ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఈఓ అబ్దుల్ ఘని మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై ఆసక్తి పెంచుకొని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని సూచించారు. హెచ్ఎం ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. గతేడాది తమ పాఠశాల నుంచి ఒక విద్యార్థిని ఐఐఐటీకి ఎంపికై ందని, ఈ ఏడాది కూడా మెరుగైన ఫలితాలే లక్ష్యంగా బోధన అందిస్తున్నామని తెలిపారు. క్రీడల్లోనూ విద్యార్థులు జిల్లా, రాష్ట్రస్థాయికి ఎంపికవుతున్నారని వివరించారు. అనంతరం కేజీబీవీని సందర్శించి వంటగదిని పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, ఆహార తయారీ విధానాన్ని తనిఖీ చేశారు.
సమగ్ర శిక్షణపై సమీక్ష
అనంతరం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ, అసిస్టెంట్ డైరెక్టర్, సెక్టోరియల్ అధికారులు, టెక్నికల్ పర్సన్లు, ఏపీవోలతో సమగ్ర శిక్షణ కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పీజీఐ సూచికల్లో జిల్లాను మెరుగైన స్థానంలో నిలిపేందుకు పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, డ్రాప్‌బాక్స్, ఆధార్ నమోదు, ఖాన్ అకాడమీ, ఏఎక్స్ఎల్ తదితర కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో ఎంఈఓ వెంకట్, సర్పంచ్ మాలి శివకుమార్ రెడ్డి, జీహెచ్ఎం విజయకుమార్, కస్తూర్బా పాఠశాల ఎస్ఓ శైలజ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సోమిరెడ్డి
దోమ జెడ్పీహెచ్ఎస్, కేజీబీవీ సందర్శన


