● కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం
● డిపో గౌరవాధ్యక్షుడు సోమశేఖర్
తాండూరు టౌన్: ఆర్టీసీ కార్మికులకు భద్రత కల్పించాలని తాండూరు డిపో గౌరవాధ్యక్షుడు సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత నెల 26న మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ ప్రవళిక ప్రయాణికురాలి చేతిలో దాడికి గురై చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమన్నారు. బుధవారం ఉదయం కార్మికులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. స్థానిక అంబేడ్కర్ చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల భద్రతపై స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. మృతి చెందిన మహిళా కండక్టర్ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, తల్లికి ఆర్టీసీలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటనకు కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. నిరసన కార్యక్రమంలో డిపో కార్యదర్శి నవీన్ గౌడ్, డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ బాలప్ప, డిపో అధ్యక్షుడు బస్వరాజ్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


