టీజీ–ఐపాస్‌లో 35 వేల సంస్థల డేటాను ఎన్‌క్రిప్ట్ చేసిన ర్యాన్సమ్‌వేర్ ముఠా
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ పారిశ్రామిక రంగానికి కీలకమైన సింగిల్ విండో అనుమతుల వేదిక ‘టీజీ–ఐపాస్’పై జరిగిన ర్యాన్సమ్‌వేర్ దాడి వెనుక అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల హస్తం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. హ్యాకర్లు సర్వర్‌లో వదిలిన ఈ–మెయిల్ చిరునామా ఆధారంగా పరిశీలించగా.. దాడికి టర్కీతో సంబంధం ఉన్నట్లు తేలింది. గత నెల 22న జరిగిన ఈ దాడిలో 28 వేల కంపెనీలకు సంబంధించిన కీలక సమాచారం, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న మరో ఏడు వేల సంస్థల డేటా ఎన్‌క్రిప్ట్ అయింది. అయితే పరిశ్రమల శాఖ నిపుణుల బృందం రంగంలోకి దిగి డేటాను డీక్రిప్ట్ చేయడంతో సమాచారం తిరిగి అందుబాటులోకి వచ్చింది.
అర్ధరాత్రి వేళ సర్వర్‌పై దాడి..
టీజీ–ఐపాస్ ద్వారా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, వివిధ శాఖల క్లియరెన్స్‌లు అందిస్తారు. ఈ కీలక పోర్టల్ గత నెల 22 రాత్రి అకస్మాత్తుగా పనిచేయడం నిలిచిపోయింది. అప్లికేషన్ డేటాబేస్ సర్వర్‌కు కనెక్ట్ కాకపోవడంతో అధికారులు తొలుత సాంకేతిక సమస్యగా భావించారు. పోర్టల్ హోస్టింగ్ సేవలు అందిస్తున్న సంస్థను సంప్రదించి సర్వర్‌ను రీస్టార్ట్ చేసినా సమస్య పరిష్కారం కాలేదు. తదుపరి పరిశీలనలో ఎస్‌క్యూఎల్ సర్వర్ ఏజెంట్ సేవ నిలిచిపోయినట్లు గుర్తించారు. దాన్ని తిరిగి ప్రారంభించే ప్రయత్నాలూ ఫలించలేదు. లోతుగా పరిశీలించగా సర్వర్ భద్రతను ఛేదించి డేటాబేస్‌తో పాటు కీలక ఫైళ్లను హ్యాకర్లు ఎన్‌క్రిప్ట్ చేసినట్లు బయటపడింది. ప్రభావిత ఫైళ్ల పేర్ల చివరలో గుర్తుతెలియని ‘.వీజీబీ’ ఎక్స్‌టెన్షన్ జతచేసి ఉన్నాయి. సర్వర్‌లో సంప్రదింపుల కోసం ఈ–మెయిల్ చిరునామా, మెషీన్ ఐడీతో కూడిన ర్యాన్సమ్ నోట్ కూడా లభించింది. దీంతో ఇది సాధారణ సాంకేతిక సమస్య కాదని, పక్కా ర్యాన్సమ్‌వేర్ దాడి అని అధికారులు నిర్ధారించారు.
‘.వీజీబీ’ అంటే వైరస్ పేరు కాదు...
ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారిన ‘.వీజీబీ’ అనే ది ప్రత్యేక వైరస్ పేరు కాదని నిపుణులు చెప్తున్నారు. కంప్యూటర్‌లోని ఫైళ్లను ఎన్‌క్రిప్ట్ చేసిన తర్వాత వాటి పేర్ల చివర హ్యాకర్లు జతచేసిన ఫైల్ ఎక్స్‌టెన్షన్ మాత్రమే అని స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా ఫొటోలకు .జేపీజీ, పీడీఎఫ్ పత్రాలకు .పీడీఎఫ్, వర్డ్ డాక్యుమెంట్లకు .డీఓసీహెచ్ ఎక్స్‌టెన్షన్లు ఉంటాయి. అదే తరహాలో ర్యాన్సమ్‌వేర్ దాడుల్లో ఎన్‌క్రిప్ట్ అయిన ఫైళ్లను గుర్తించేందుకు నేరగాళ్లు ప్రత్యేక ఎక్స్‌టెన్షన్లు ఉపయోగిస్తుంటారని పేర్కొంటున్నారు. అయితే ‘.వీజీబీ’ కనిపించిందని మాత్రమే దాడి చేసిన మాల్‌వేర్ ఏదో చెప్పలేమని, దాని కోడ్, ఎన్‌క్రిప్షన్ పద్ధతి, ఫైళ్ల నమూనాలు, ర్యాన్సమ్ నోట్, సర్వర్ లాగ్స్‌ను విశ్లేషించినప్పుడే అసలు మాల్‌వేర్ స్వరూపం తెలుస్తుందని చెప్తున్నారు.
టర్కీ లింక్.. అసలు హ్యాకర్లు ఎక్కడ?
హ్యాకర్లు వదిలిన ఈ–మెయిల్ వివరాలను సైబర్ నిపుణులు పరిశీలించగా టర్కీతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే ఈ–మెయిల్ చిరునామా లేదా దాని సాంకేతిక ఆనవాళ్లు మాత్రమే నేరగాళ్ల అసలు స్థావరాన్ని నిర్ధారించవని చెప్తున్నారు. వీపీఎన్‌లు, ప్రాక్సీ సర్వర్లు, ఇతర దేశాల్లోని సర్వర్లు, తాత్కాలిక ఈ–మెయిల్ ఖాతాలను వినియోగించి ఉండే అవకాశాలనూ పరిశీలించాల్సి ఉంటుందని అంటున్నారు. దాడికి ఉపయోగించిన ఐపీ అడ్రస్‌లు, డొమైన్ వివరాలు, సర్వర్ లాగ్స్, డిజిటల్ ఆనవాళ్ల ఆధారంగా అసలు ఆపరేటర్లను గుర్తించాల్సి ఉంది. ఈ కోణంలో దర్యాప్తు సాగుతోంది. సాధారణంగా ర్యాన్సమ్‌వేర్ ముఠాలు డేటాను ఎన్‌క్రిప్ట్ చేసి, తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు బాధిత సంస్థల నుంచి భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తాయి. టీజీ ఐపాస్ ఘటనలో మాత్రం నిర్దిష్ట మొత్తాన్ని డిమాండ్ చేయకుండా సంప్రదింపు ఈ–మెయిల్ చిరునామాను మాత్రమే వదిలారు. దీంతో డబ్బు వసూలు చేయడమే లక్ష్యమా? లేక ప్రభుత్వ పారిశ్రామిక అనుమతుల వ్యవస్థను స్తంభింపజేయడం, కీలక వ్యాపార సమాచారాన్ని లక్ష్యంగా చేసుకోవడమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డేటాను కాపీ చేసి బయటకు తరలించారా? అన్నది కూడా దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఫైర్‌వాల్స్ పటిష్టం.. బ్యాకప్ భద్రతపై దృష్టి...
మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా పరిశ్రమల శాఖ సైబర్ భద్రతను బలోపేతం చేస్తోంది. అదనపు ఫైర్‌వాల్స్ ఏర్పాటు, సర్వర్ భద్రత, అప్లికేషన్ వ్యవస్థల పటిష్టతపై దృష్టి పెట్టింది. పోర్టల్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే ముందు భద్రతా పరీక్షలు నిర్వహించింది. కీలక డేటాకు వేరుగా, ఆఫ్‌లైన్‌లో బ్యాకప్‌లు నిర్వహించడం, వాటిని క్రమం తప్పకుండా పరీక్షించడం, బహుళస్థాయి ధ్రువీకరణ విధానాలు అమలు చేయడం వంటి చర్యలు అవసరమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. టీజీ–ఐపాస్ డేటా తిరిగి పొందడంతో తక్షణ ముప్పు తొలగినప్పటికీ.. టర్కీ లింక్ వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్ ఎవరిది? 35 వేల సంస్థల సమాచారం ఎంతవరకు సురక్షితం? అన్న ప్రశ్నలకు సమాధానాలు పోలీసుల దర్యాప్తు తర్వాతే దొరికే అవకాశం ఉంది.
హ్యాకర్ల ఈ–మెయిల్ వివరాల ఆధారంగా టర్కీ లింక్ గుర్తింపు
ఫైళ్లకు ‘.వీజీబీ’ ఎక్స్‌టెన్షన్.. సర్వర్‌లో ర్యాన్సమ్ నోట్ లభ్యం


