కొండాపూర్(సంగారెడ్డి): అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండాపూర్ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... కోహీర్ మండలం పీచే ర్యాగడి గ్రామానికి చెందిన మంగలి వీరేశం(33) వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తుమ్మలపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆరేళ్లుగా కొండాపూర్ మండలం మల్కాపూర్ చౌరస్తాలో నివాసం ఉంటున్నారు. కాగా క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన అప్పులు పెరిగిపోవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రి మంగలి రామచందర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కార్యకర్తలకు
అండగా ఉంటాం
కుల్కచర్ల: పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతీ కిరణ్ అన్నారు. బుధవారం పార్టీ చౌడాపూర్ మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తండ్రి భీమయ్య ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన పార్టీ నాయకులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు బంధయ్య, శ్రీనివాసులు, కేశవులు, ముకుంద నాగేశ్వర్, రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
తాండూరు రూరల్: మండలంలోని ఐనెల్లి గ్రామంలో బుధవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కరన్‌కోట్ ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కృష్ణగౌడ్(45) కల్లు గీత కార్మికుడు. సాయంత్రం ఇంట్లోని దులానికి ఉరేసుకొని చనిపోయాడు. మృతడి భార్య పావని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఖైరతాబాద్ : విద్యార్థులు మొబైల్ చూడటాన్ని (స్క్రీన్ టైం) తగ్గించి చదువులో రాణించాలని లా అండ్ ఆర్డర్ డీజీ మహేష్ భగవత్ అన్నారు. బుధవారం రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్, ఎల్‌వి ప్రసాద్ ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లో ప్రాజెక్ట్ దృష్టి పేరుతో 2500 మంది పిల్లలకు ఉచతంగా కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మహేష్ భగవత్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, విద్యార్థి దశ నుంచే ఆరోగ్యంపై శ్రద్ద వహించాలన్నారు. ప్రత్యేక అతిధిగా రోటరీ డిస్ట్రిక్ట్ 3150 డిస్టిక్ట్ గవర్నర్ ఉదయ్ పిలాని రోటరీ క్లబ్ బంజారాహిల్స్ అధ్యక్షుడు వాసుదేవన్ పాల్గొన్నారు.
కాంగ్రెస్
బలోపేతమే లక్ష్యం
ఇబ్రహీంపట్నం రూరల్: కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం ఆదిభట్ల జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రమిద కన్వెక్షన్ హాల్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన, ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలో పదిహేనేళ్ల కాలంలో జరగని అభివృద్ధి గడిచిన రెండున్నరేళ్లలో జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి తప్పకుండా పదవులు వస్తాయని, రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అందరి సహకారం, సమష్టి నిర్ణయాలతో ముందుకు వెళ్దామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
హామీలను నెరవేరుస్తున్నాం
భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. ఒక్కో నియోజకవర్గానికి ఐదు వేలకు పైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు మల్‌రెడ్డి రాంరెడ్డి, మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


