సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు ఉత్తర హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజల దాహార్తిని తీర్చిన చెరువు.. కాలక్రమంలో ఆక్రమణలు, కాలుష్యం, నిర్లక్ష్యం బారిన పడి ఉనికినే కోల్పోయే దశకు చేరింది. అదే ఫాక్స్‌సాగర్(కొత్త చెరువు).. దానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు హైడ్రా నడుం బిగించింది. 129 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జలాశయాన్ని పునరుద్ధరించి మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దాలని ప్రణాళిక రూపొందించింది. నీటినిల్వ సామర్థ్యం పెంపు, వరద నియంత్రణ, భూగర్భ జలాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ.. ఇలా సమగ్ర లక్ష్యాలతో కార్యాచరణ సిద్ధం చేసింది. దీనికోసం తొలి విడతలో రూ.75 కోట్లు వెచ్చిస్తోంది. జీడిమెట్ల ప్రాంతంలోని ఫాక్స్ సాగర్‌ను 1897లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో నిర్మించారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ వంటి భారీ జలాశయాలు అందుబాటులోకి రాకముందే నగర నీటి అవసరాలను తీర్చిన వనరుల్లో ఇదొకటి. చెరువు నుంచి నీటిని పంప్‌హౌస్, పైపులైన్లతో సరఫరా చేసేవారు. ‘ఫాక్స్ సాగర్ 1897’ అనే శిలాశాసనం నేటికీ ఆ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది.
150 ఎకరాలు వరకు ఆక్రమణ
దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో 150 ఎకరాలు వరకు ఆక్రమణలకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. కొన్ని ప్రాంతాల్లో చెరువు భూమిని చదును చేసి, మట్టిపోసి, ప్రహరీలు నిర్మించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు మూసుకుపోవడం, మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు చేరడంతో నీటినిల్వ సామర్థ్యం దెబ్బతింది. పూడిక, 10 నుంచి 15 అడుగుల మేర ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ హద్దులను నిర్ధారించి ఆక్రమణలను తొలగించనున్నారు. చట్టబద్ధమైన పట్టాలు ఉన్న భూ యజమానులకు నిబంధనల ప్రకారం టీడీఆర్ కల్పిస్తామని అధికారులు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ఏడాది వ్యవధిలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. చెరువులోకి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు చేరకుండా డ్రైనేజీ ప్రవాహాలను మళ్లించడం, అవసరమైన చోట ఎస్టీపీ ఏర్పాటు చేయడం ఈ ప్రణాళికలో కీలకం. శుద్ధి చేసిన నీటిని చెరువు అవసరాలకు వినియోగించేలా చర్యలు చేపట్టనున్నారు.
అదనపునీరు బయటకు వెళ్లేలా..
పూడిక, వ్యర్థాలను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లను పునరుద్ధరిస్తారు. భారీ వర్షాల సమయంలో అదనపు నీరు సురక్షితంగా బయటకు వెళ్లేలా సర్‌ప్లస్ వీర్, డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. ఫాక్స్ సాగర్‌కు దాదాపు 47 కిలోమీటర్ల పరీవాహక ప్రాంతం నుంచి వర్షపు నీరు చేరుతుంది. ఈ క్యాచ్‌మెంట్ ఏరియాలోని వర్షపు నీటిని ఫీడర్ నాలాల ద్వారా చెరువుకు చేర్చడం, పేరుకుపోయిన అడ్డంకులను తొలగించడం కీలకం. కట్ట పటిష్టత, వరద ప్రవాహ మార్గాల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చెరువు అడుగున నీరు ఇంకేలా సహజ పరిస్థితులను మెరుగుపరిస్తే పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల పెరుగుదలకూ అవకాశం ఉంటుంది.
129 ఏళ్ల నాటి ఫాక్స్‌సాగర్‌కు
హైడ్రాతో మహర్దశ
ఆరో నిజాం హయాంలో
1897లోనే నిర్మాణం
తొలి విడతలో రూ.75 కోట్లతో పునరుద్ధరణ పనులు
మురుగునీరు, వ్యర్థాలకు అడ్డుకట్ట


