ధారూరు: గొర్రెలను శుభ్రం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు సుద్ద గుంత నీటిలో మునిగి ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన మండలంలోని తరిగోపుల గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. ధారూరు ఎస్‌ఐ సురేష్, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మున్నూరు అశోక్(18), సక్కిళ్ల శ్రీనివాస్(40), పద్మమ్మ, ఖలీల్, శ్రీశైలం ఉదయం గొర్రెలు, మేకలను మేత కోసం తోలుకెళ్లారు. ఏడాదికి ఒకసారి జీవాలను నీటితో శుభ్రం చేసి పూజ చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా కాపరులు గ్రామ శివారులోని సుద్ద గుంతలో గొర్రెలను శుభ్రం చేస్తుండగా అవి భయంతో ఒడ్డుకు పారిపోయాయి. వాటిని పట్టుకునే క్రమంలో అశోక్ ప్రమాదవశాత్తు సుద్ద గుంతలోకి పడిపోయాడు. ఈత వచ్చిన శ్రీనివాస్ కాపాడేందుకు నీటిలోకి దిగాడు. ఈ క్రమంలో అశోక్.. శ్రీనివాస్ మెడను గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ నీటిలో మునిగిపోతుండగా గమనించిన ఖలీల్ తన లుంగీని అందించాడు. వారు దాన్ని వదిలేయడంతో ఇద్దరూ నీట మునిగారు. వెంటనే తోటి కాపరులు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. ఏర్పుల వెంకటయ్య, కుర్వ రాజు, చిట్టి నర్సింహులు ఘటనా స్థలానికి వచ్చారు. సుద్ద గుంతలోకి దిగి అశోక్, శ్రీనివాస్ మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. ధారూరు సీఐ రఘురామ్, ఎస్‌ఐ సురేష్ మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ భార్య దేవమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
శ్రీనివాస్, అశోక్ మృతదేహాలు
గొర్రెలను శుభ్రం చేసే క్రమంలో ప్రమాదం
ధారూరు మండలంలో ఘటన


