తాండూరు టౌన్: గతేడాది చేవెళ్లలోని మీర్జాగూడ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు, కంకర టిప్పర్ ఢీకొన్న ఘటనలో అసువులు బాసిన 13 మంది మృతులకు బీవీజీ ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పట్టణంలో పలువురు ఘన నివాళులర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఆరోజు జరిగిన ప్రమాద ఘటన అత్యంత విషాదకరమైందని, పలు కుటుంబాల్లో విషాదచాయలు నింపిందని పలువురు అన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి హరీష్, పలు పార్టీల నాయకులు, ప్రముఖులు డాక్టర్ సంపత్ కుమార్, బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, విఠల్ రెడ్డి, నయీమ్, భద్రేశ్వర్, రఘు, వేణుగోపాల్, పర్యాద రామకృష్ణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


