కుల్కచర్ల: మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ రమేష్ హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ ఖాజా, కానిస్టేబుల్ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కుల్కచర్ల: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కుల్కచర్ల ఎస్‌ఐ రమేష్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని అనంతసాగర్ వద్ద ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతి తీసుకున్న తర్వాతే ఇసుక తరలించాలని సూచించారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు ఉంటాయన్నారు. ఇసుక తరలిస్తున్న హన్మంతుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కొందుర్గు: స్థానిక దివ్యశక్తి పరిశ్రమకు పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో తమ పంటలు దెబ్బతినడంతోపాటు పాడిపశువులు రోగాలబారిన పడుతున్నాయని గ్రామస్తులు ఇప్పటికే ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పీసీబీ అధికారులు సెప్టెంబర్ 18, అక్టోబర్ 23న పరిశ్రమను సందర్శించారు. పరిశ్రమ పరిసరాలను పరిశీలించారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో పర్యావరణం దెబ్బ తింటోందని గమనించి యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీచేశారు. కాలుష్యం వెలువడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇబ్రహీంపట్నం రూరల్: మద్యానికి బానిసైన యువకుడు అదృశ్యమైన సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. కొంగరకలాన్‌కు చెందిన నర్సగళ్ల రాజు లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల మద్యానికి బానిసై భార్య సుమలతతో గొడవ పడుతున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యం తాగి గొడవ పడి భార్యను కొట్టడంతో 20 రోజుల క్రితం బడంగ్‌పేట్‌లోని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి రాజు నిత్యం ఫోన్లు చేసేవాడు. గత నెల 10న ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఇంటికి వెళ్లి చూసింది. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


