రైతుల నుంచి సేకరించిన ధాన్యంమిల్లర్లకు అప్పగింత తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా అమ్ముకున్న యజమానులు ఉమ్మడి జిల్లాలో భారీగా పేరుకుపోయిన బకాయిలు ఇప్పటికే పలు మిల్లుల మూత తిన్నది కక్కించడంలో అధికారులు విఫలం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిల వసూళ్లలో ఉమ్మడి జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మిల్లర్లు తిన్నది కక్కించడంలో విఫలమవుతున్నారు. రూ.వంద కోట్లకుపైగా బకాయిలు వసూలు కావాల్సి ఉన్నా ఇప్పటి వరకు రూ.20 కోట్లు మించకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికీ కొంత మంది మిల్లర్లు సేకరించిన ధాన్యాన్ని మరాడించకపోవడం, ఆడించిన మరికొంత మంది వచ్చిన బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకపోగా బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా తనిఖీలు చేయించి, కేసులు నమోదు చేయించింది. అయినా మెజార్టీ మిల్లర్లు బకాయిల చెల్లింపునకు అంగీకరించడం లేదు. ఇప్పటికే కొన్ని రైస్‌మిల్లులు మూతపడటం, ఆయా మిల్లల నుంచి బకాయిలను వసూలు చేయడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. విధిలేని పరిస్థితుల్లో ఆయా మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ (ఆర్‌ఆర్)ను ప్రయోగించాలని నిర్ణయించారు.
రంగారెడ్డిలో రూ.30 కోట్లకుపైగా..
రంగారెడ్డి జిల్లాలో 2015 రబీ నుంచి 2024 ఖరీఫ్ మధ్య కాలంలో ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించి ఆయా మిల్లులకు అప్పగించింది. మిల్లర్లకు సరఫరా చేసిన ధాన్యానికి, వాటి నుంచి తిరిగి వచ్చిన బియ్యానికి మధ్య 16,601.319 మెట్రిక్ టన్నుల బియ్యం వ్యత్యాసం నమోదైంది. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. వీటిలో ఇబ్రహీంపట్నం, కడ్తాల్, ఆమనగల్లులోని పది మిల్లులు ఉన్నాయి. బకాయి పడిన మొత్తానికి 25 శాతం అదనంగా జరిమానా విధించారు. ఈ జరిమానాతో కలిపి 20,805.070 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. తనిఖీలు, కేసుల నమోదు తర్వాత 8,497.227 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆయా మిల్లర్ల నుంచి రికవరీ చేశారు. మరో 12,307.847 మెట్రిక్ టన్నుల రికవరీ కావాల్సి ఉంది. 25 శాతం జరిమానాతో కలిపి ఆయా మిల్లర్ల నుంచి రూ.30,10,53,353 బకాయి వసూలు కావాల్సి ఉంది. బకాయి పడిన వాటిలో ఇప్పటికే పలు మిల్లులు మూతపడ్డాయి. వాటి నుంచి రికవరీ కష్టమవుతుండటంతో ఆర్‌ఆర్‌ను ప్రయోగించాల్సిందిగా సూచించింది. అయినా మెజార్టీ బకాయిదారుల నుంచి వసూలు చేయలేని దుస్థితి నెలకొంది.
వారం రోజుల్లో క్లియర్ చేయాలి
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కేఎంఎస్) 2014–15 నుంచి ఖరీఫ్ 2024–25 వరకు ధాన్యం సేకరణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీఓఎంఎస్ నంబర్17 ప్రకారం రైస్ మిల్లర్ల నుంచి సీఎంఆర్ బకాయిలు వసూలు చేయాలని రంగారెడ్డి అదనపు కలెక్టర్ కె.చంద్రారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. రెండు రోజుల క్రితం బకాయి పడిన రైస్ మిల్లర్లతో ఆయన స్వయంగా మాట్లాడి బకాయి వివరాలు సమీక్షించారు. మిల్లర్ల వారీగా పరిస్థితిని పరిశీలించి, చెల్లింపుల్లో జాప్యానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. బకాయిల చెల్లింపునకు సంబంధించిన రైస్ మిల్లర్లకు తుది అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల్లోగా బకాయిలు పూర్తిగా చెల్లించాలని ఆదేశించారు. చెల్లించని రైస్ మిల్లర్లపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. సీఎంఆర్‌కు సంబం ధించి బకాయిల వివరాలను పరిశీలించి, వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
సాధారణంగా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఐకేపీ, డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుంది. తర్వాత ఎంపిక చేసిన మిల్లర్లకు తరలిస్తుంది. ఆయా మిల్లర్లు మరాడించి 67 శాతం బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ప్రభుత్వం ఆ బియ్యాన్ని వివిధ సంక్షేమ పథకాలకు మళ్లిస్తుంది. మిగిలిన బియ్యాన్ని గిడ్డంగుల్లో నిల్వ చేస్తుంది. 2022–23లో ధాన్యం దిగుబడి భారీగా వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 74 రైస్ మిల్లులు ఉండగా, 67 మాత్రమే సీఎంఆర్ టెండర్లలో పాల్గొన్నాయి. క్వింటాలుకు రూ.2,235 ధర పెట్టి కొనుగోలు చేశారు. వీటిలో కొంతమంది మిల్లర్లు ఇప్పటికీ మరాడించలేదు. మరికొంత మంది వాటిని బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్లో అమ్మేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మిల్లర్లు ప్రభుత్వానికి రూ.102 కోట్లకుపైగా బకాయి పడ్డారు. ఓ మిల్లర్ ఏకంగా రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు, మరో మిల్లర్ రూ.17 కోట్లకుపైగా బకాయి పడినట్లు తెలిసింది. మెజార్టీ మిల్లుర్లు రూ.30 లక్షలల్లోపై బకాయి పడ్డారు. 25 శాతం జరిమానా కలిపి మొత్తాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్‌ద్వారా వసూలు చేయా లని నిర్ణయించి, సెప్టెంబర్ చివరి నాటికి రూ.20 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు తెలిసింది.
వికారాబాద్‌లో రూ.వంద కోట్లకుపైనే..


