ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలి

Oct 31 2026 11:03 PM | Updated on Oct 31 2026 11:03 PM

కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తిరుపతిరెడ్డి శ్రీవారి ఆలయ ప్రాకార నిర్మాణానికి భూమిపూజ ప్రథమ శిల ప్రతిష్ఠాపన

కొడంగల్‌: పట్టణంలోని పద్మావతీ సమేత మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ నవీకరణ పనుల్లో భాగంగా శుక్రవారం ఆలయ ప్రాకార నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎనుముల తిరుపతిరెడ్డి చేతుల మీదుగా అర్చకులు ప్రథమ శిలాస్థాపన మహోత్సవాన్ని నిర్వహించారు. తిరుమల నుంచి వచ్చిన అర్చకులు వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా కార్యక్రమం జరిపించారు. ఉదయం యాగశాలలో అర్చకుల ఆధ్వర్యంలో ఆగమ శాస్త్ర సంప్రదాయం ప్రకారం విశేష వైదిక పూజలు, ప్రత్యేక హోమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన తిరుపతిరెడ్డిని ఆలయ ధర్మకర్తలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9.20 నుంచి 9.40 గంటల వరకు శ్రీవారి ఆల య ప్రాకార ప్రథమ శిలాస్థాపన కార్యక్రమా న్ని వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌ గుప్తా, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, స్తపతి డీఎస్‌వీ ప్రసాద్‌, పురావస్తు శాఖ పరిశోధకులు శివనాగిరెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌, పార్టీ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి, టెంపుల్‌ డిజైన్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ ప్రతినిధులు, రోడ్లు భవనాల శాఖ అధికారులు, ఆలయ ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

వెంకన్న కోవెలగా పేరుగాంచాలి

కొడంగల్‌ వెంకన్న స్వామి కోవెల మరో తిరుమలగా పేరుగాంచాలని తిరుపతిరెడ్డి ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణంలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. గడువులోపు నిర్మాణం పూర్తి కావాలన్నారు. నిర్మాణంలో జాప్యం లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వైఖానస ఆగమ శాస్త్రోకంగా ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాడ వీధులు, క్యూలైన్‌, కల్యాణ మంటపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, ప్రత్యేక అవసరాల గదులు, పార్కింగ్‌, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి ఆధునాతన భవనాలు నిర్మించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌ శ్రీవారి ఆలయ నవీకరణ పనులకు రూ.110 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. సంప్రదాయ నిర్మాణ శైలిని కాపాడుతూ నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement