వద్దన్నా డ్రిల్లింగ్‌! | - | Sakshi
Sakshi News home page

వద్దన్నా డ్రిల్లింగ్‌!

Oct 31 2026 11:03 PM | Updated on Oct 31 2026 11:03 PM

యథేచ్ఛగా బోరుబావుల తవ్వకం ప్రతి నెలా సగటున 300లకు పైగా.. గడిచిన ఏడాదిలో అనుమతి పొందింది నాలుగింటికే.. ఎల్‌నినో నేపథ్యంలో తాజాగా ఆంక్షలు

వికారాబాద్‌: బోరుబావుల తవ్వకాలపై ఆంక్షలు కొనసాగుతున్నా జిల్లాలో యథేచ్ఛగా డ్రిల్లింగ్‌ దందా సాగుతోంది. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఎల్‌నినో నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బోర్లు వేయరాదని అధికారులుస్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిత్యం పదుల సంఖ్యలో డ్రిల్లింగ్‌ చేస్తున్నారు. సాధారణంగా ఫిబ్రవరి మాసం తర్వాత బోరుబావులు తవ్వే పనులు ప్రారంభించేవారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ సారి విచ్ఛలవిడిగా తవ్వేస్తున్నారు. ప్రతి నెలా దాదాపు 300కి పైగా బోరుబావులు తవ్వుతున్నా ఒక్కదానికి కూడా అనుమతి తీసుకోవడం లేదు. అఽధికారులు డ్రిల్లింగ్‌ దందాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత సీజన్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనా ఇప్పటికే రికార్డు స్థాయిలో నీటిమట్టం తగ్గిపోయింది. రోజురోజుకూ పరిస్థితి చేయి దాటిపోతోంది. జిల్లాలో లక్షకుపైగా వ్యవసాయ బోరుబావులు ఉండగా 35వేల పైచిలుకు ఇళ్ల అవసరాల కోసం వేశారు.

వేల సంఖ్యలో..

ప్రభుత్వ, ప్రైవేటు అవసరాల కోసం బోర్లు వేయాలంటే ముందుగా భూగర్భ జలవనరుల శాఖనుంచి అనుమతి పొందాలి. వాల్టా చట్టం ప్రకారం ముందుగా తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. వారు ఆ అర్జీని భూగర్భ జలవనరుల శాఖకు పంపుతారు. ఆ శాఖ జియాలజిస్టులు నీటి లభ్యతను పరిశీలించి నీరు ఉన్నట్లు నిర్ధారణ అయితే అనుమతి ఇస్తారు. ఆ తర్వాతే బోరు వేసుకోవచ్చు. కానీ ఈ ప్రక్రియ జిల్లాలో మచ్చుకై నా అమలు కావడం లేదు. ప్రతి నెలాసగటున 300కు పైగా బోరుబావులు తవ్వుతున్నట్లు అంచనా. ఈ లెక్కన ఏడాదికి 2,500 నుంచి 3,000 వరకు డ్రిల్లింగ్‌ చేస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో కేవలం పదింటికి మాత్రమే అనుమతులు ఉన్నాయి.

అవగాహన లేక..

బోర్లు తవ్వే విషయంలో రైతులకు అవగాహన ఉండటం లేదు. దీంతో పదుల సంఖ్యలో వేసి అప్పుల పాలవుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకొని భార్య పిల్లలను అనాథలను చేస్తున్నారు. అన్నదాతల ఆశలను డ్రిల్లింగ్‌ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. అవగాహన కల్పించాల్సిన అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జియాలజిస్టులు చూపుతున్న పాయింట్లు సైతం సగానికిపైగా ఫేయిల్‌ అవుతున్నాయి. ఇప్పటికీ 70 శాతం మంది రైతులు కొబ్బరికాయ, ఇతర మంత్ర తంత్రాల ద్వారా నీటి లభ్యతను తెలుసుకుంటున్నారు.

12వేలకు పైగా అనధికార బోర్లు

జిల్లాలో లక్ష పైచిలుకు వ్యవసాయ బోర్లు, 35 వేల పైచిలుకు ఇళ్లకు ఉన్నాయి. 12వేలకు పైగా అనధికార బోర్లు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తు న్నారు. వ్యవసాయ రంగ విషయంలో ఒక బోరుకు మరో బోరుకు మధ్య కనీసం 80 మీటర్ల దూరం ఉండాలి. ప్రజా అసరాలకు వినియోగించే వాటికి 250 మీటర్ల దూరం ఉండాలి. కానీ ఇవేవీ అమలు కావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో 1000 నుంచి 1200 అడుగుల లోతు వరుకు డ్రిల్లింగ్‌ చేస్తున్నారు.

నిబంధనలు బేఖాతరు

అనుమతి తప్పనిసరి

బోరు డ్రిల్లింగ్‌ చేసేవారు తప్పని సరిగా అనుమతి తీసుకోవాలి. లేదంటే వాహనాన్ని సీజ్‌ చేస్తాం. బోరు వేసే వ్యక్తిపై చూడా చర్యలు ఉంటాయి. తహసీల్దార్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే నీటి లభ్యతను పరిశీలించి అనుమతులు ఇస్తాం.

– రవి, భూగర్భజలవనరుల శాఖ జిల్లా అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement