దౌల్తాబాద్: ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టం తగ్గిపోయిందని ఎవరూ బోర్లు వేయరాదని, ఒకవేళ వేస్తే కఠిన చర్యలు ఉంటాయని కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం దౌల్తాబాద్‌లో ఎంపీడీఓ ఉసెనప్ప అధ్యక్షతన మండల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జూన్ వరకు ఎల్‌నినో ప్రభావం ఉంటుందన్నారు. రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఇంకుడు గుంతలు, ఫాంపాండ్స్, రీచార్జ్ పిట్స్ నిర్మించుకోవాలని తెలిపారు. మండలంలో దెబ్బతిన్న రైతు వేదికల వివరాలు తెలియజేస్తే వాటి బాగుకు నిధులు మంజూరయ్యేలా చూస్తామన్నారు. ధాన్యం కొనుగోలు చేపట్టాలని సర్పంచ్‌లు కోరగా.. రెండు మూడు రోజుల్లో ప్రారంభిస్తామని ఏఓ తులసి తెలిపారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఉన్నాయని, పాత తీగలతో ఇబ్బందులు పడుతున్నామని సర్పంచులు తెలపగా వాటిని సరిచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏఈ మహిపాల్‌కు సూచించారు. వీబీజీరామ్‌జీ పథకం కింద గ్రామాల్లో పశుగ్రాసం పెంచేందుకు, పశువుల నీటితొట్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని పశువైద్యాఽధికారిణి వరలక్ష్మి చెప్పారు. గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పీఆర్, ఆర్‌అండ్‌బీ రోడ్లను వెంటనే పూర్తి చేయాలని కడా అధికారి ఆదేశించారు. వచ్చే నెల 7నుంచి 9వ తేదీ వరకు నియోజకవర్గంలోని హకీంపేటలో ప్రభుత్వం రాష్ట్రస్థాయి రైతుమేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సురేష్‌బాబు, ఏఈలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


