పత్తి రైతు కుదేలు | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతు కుదేలు

Oct 30 2026 7:30 AM | Updated on Oct 30 2026 7:30 AM

ఇష్టం వచ్చిన ధరకు కొనుగోలు చేస్తున్న మిల్లర్లు హమాలీలు, కమీషన్‌ పేరుతో కోత పట్టించుకోని మార్కెటింగ్‌ శాఖ అధికారులు లబోదిబోమంటున్న అన్నదాతలు

తాండూరు రూరల్‌: మిల్లర్ల మాయాజాలంతో పత్తి రైతులు కుదేలవుతున్నారు. ఇష్టం వచ్చిన ధరకు కొనుగోలు చేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. హమాలీలు, కమీషన్‌ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్‌ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. తాండూరు మండలంలో 6వేల ఎకరాల్లో, పెద్దేముల్‌ మండలంలో 13వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. విత్తు వేసింది మొదలు ఇబ్బంది పడుతూనే వచ్చారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడక విత్తనం మొలకెత్తలేదు. వేల రూపాయల నష్టం వాటిల్లింది. చాలా మంది రెండోసారి విత్తనం వేయాల్సి వచ్చింది. నీటి వసతి ఉన్న వారు పంటను కాపాడుకున్నారు. లేని వారు తీవ్రంగా నష్టపోయారు. ఇన్ని కష్టాలు భరించిన అనంతరం పంట చేతికి వస్తే మిల్లర్లు మోసం చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొర్రీలు పేడుతూ ధర తగ్గిస్తున్నారని తెలిపారు. విధిలేని పరిస్థితుల్లో వారు చెప్పిన ధరకే విక్రయించాల్సి వస్తోందన్నారు.

హమాలీ, కమీషన్‌ పేరుతో..

పత్తి మిల్లు యజమానులు హమాలీ, కమీషన్‌ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా క్వింటాలు ఏ గ్రేడ్‌ పత్తికి రూ.8,667 ధర నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదు. మద్ద తు ధర కంటే ప్రైవేటు మిల్లుల్లో ధర ఎక్కువగా ఉండటంతో రైతులు వారికే విక్రయిస్తున్నారు. మిల్లర్లు మాత్రం ఒక్కో రోజు ఒక్కో రేటు ప్రకటిస్తున్నారు. నాణ్యత ఆధారంగా క్వింటాలుకు రూ.8,975, రూ.9000, రూ.9100 ధర నిర్ణయిస్తున్నారు.

తగ్గిన దిగుబడులు

ఎల్‌నినో కారణంగా పత్తి సాగుకు పెట్టుబడి పెరిగిందని రైతులు చెబుతున్నారు. విత్తనం, ఎరువులు, పురుగు మందు పిచికారీ, కూలీల రేట్లు కలుపుకొని ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు వచ్చినట్లు చెప్పారు. సాధారణంగా పంట బాగా పండితే ఎకరాకు ఏడు నుంచి ఎనిమిదిక్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ ఏడు వర్షాలు లేక ఎకరాకు 3 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ఓ వైపు పెట్టుబడి పరిగిందని, అయినా ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి మిల్లర్లు ఇష్టం వచ్చిన ధర వేస్తున్నా మార్కెటింగ్‌ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ధర లేకుండా బిల్లు

పెద్దేముల్‌ మండలంలోని ఓ మిల్లులో ఇష్టం వచ్చిన ధర నిర్ణయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. తెల్ల కాగితంపై ధర వేసి ఇస్తున్నారు. క్వింటాలు రేటు డబ్బు మాత్రమే వేసి బిల్లులు ఇస్తున్నట్లు తెలిసింది. మార్కెటింగ్‌ శాఖ నిబంధనాల ప్రకారం బిల్లుల్లో క్వింటాళ్లు.. ధర కచ్చితంగా ఉండాలి. కానీ ఇవేవీ మిల్లర్లు పట్టించుకోవడం లేదు.

ఎల్‌నినోతో దెబ్బతిన్న పంట

చర్యలు తీసుకుంటాం

పత్తి రైతులకు నష్టం కలిగిస్తే సంబంధిత మిల్లులపై చర్యలు తీసుకుంటాం. అన్‌ లోడింగ్‌కు మాత్రమే డబ్బు తీసుకోవాలి. కమీషన్‌ తీసుకోరాదు. క్వింటాలుకు ఎంత ధర అనేది బిల్లులు స్పష్టంగా చూపించాలి. తెల్ల కాగితంపై రాసిస్తే కుదరదు. ఇలాంటి వాటిపై విచారణ చేపడతాం. రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదు.

– సాయికుమార్‌, కార్యదర్శి, కోట్‌పల్లి మార్కెట్‌ కమిటీ, పెద్దేముల్‌ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement