విదేశీ మార్కెట్‌లోకి.. తాండూరు కందిపప్పు | - | Sakshi
Sakshi News home page

విదేశీ మార్కెట్‌లోకి.. తాండూరు కందిపప్పు

Oct 30 2026 7:30 AM | Updated on Oct 30 2026 7:30 AM

● జీఐ ట్యాగ్‌ వచ్చిన నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు తొలి వాణిజ్య ఎగుమతి ● పుష్కలంగా ప్రొటీన్లు.. రుచికరం.. త్వరగా ఉడికే స్వభావం

తాండూరు: తాండూరు కందిపప్పు అంతర్జాతీయ మార్కెట్‌లోకి అగుడు పెట్టింది. తెలంగాణలో భౌగోళిక గుర్తింపు(జీఐ) పొందిన తొలి వ్యవసాయ ఉత్పత్తిగా నిలిచింది. ఈ గుర్తింపు లభించిన నాలుగేళ్ల తర్వాత విదేశీ మార్కెట్‌లో వాణిజ్య పరమైన అవకాశాలు అందివచ్చాయి. తాజాగా ఆస్ట్రేలియాకు 2.5 మెట్రిక్‌ టన్నులు ఎగుమతి అయ్యాయి. దీంతో స్థానిక వ్యవసాయ ఉత్పత్తికి అంతర్జాతీయ స్థాయిలో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్‌కు చెందిన దుర్గా ఎక్స్‌పోర్ట్‌ అండ్‌ ఇంపోర్ట్‌ సంస్థ అమ్మాస్‌ బ్రాండ్‌ పేరుతో ఈ సరుకును ఎగుమతి చేస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన భారతమ్మ పీటీపై లిమిటెడ్‌ సంస్థ దిగుమతి చేసుకుంటుండగా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సాధికార సంస్థ (అపెడా) సహకారం అందిస్తోంది.

2022లో జీఐ గుర్తింపు

తాండూరు కంది పప్పునకు 2022 డిసెంబర్‌ 6న భౌగోళిక గుర్తింపు లభించగా, అదే నెల 14న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ నుంచి జీఐ హోదా పొందిన తొలి వ్యవసాయ ఉత్పత్తిగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఒక నిర్ధిష్ట భోగోళిక ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే వస్తువుకు దాని ప్రత్యేక నాణ్యత, ఖ్యాతి, ప్రాంతీయ లక్షణాల ఆధారంగా జీఐ గుర్తింపు ఇస్తారు. ఈ హోదా తాండూరు కంది పప్పునకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఇతర ప్రాంతాల ఉత్పత్తుల నుంచి దీనిని వేరు చేసి మార్కెట్‌ చేసుకునే అవకాశాన్ని అందించింది.

సున్నపురాయి నేలలు కందికి అనుకూలం

తాండూరు, బషీరాబాద్‌, పెద్దేముల్‌, యాలాల మండలాల్లో కంది ప్రధాన పంటగా సాగవుతోంది. కాగ్నా నది పరీవాహక ప్రాంతంలోని వ్యవసాయ భూముల్లో ఈ పంటకు ప్రాధాన్యత ఉంది. ఇక్కడి నల్లరేగడి నేలలు సున్నపు రాయి నిక్షేపాలు, అటాపులైట్‌ ఖనిజంతో కూడిన భౌగోళిక పరిస్థితులు ఈ ప్రాంతానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. కందుల నాణ్యత నేలలతో పాటు వాతావరణం, సాగు పద్ధతులు కూడా ప్రభావం చూపుతాయి. తాండూరు కంది పప్పులో సుమారు 22 నుంచి 24 శాతం ప్రొటీన్లు, పప్పు రుచికరంగా ఉండటంతో పాటు త్వరగా ఉడికే గుణం, పంటలో అనుకూలత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ లక్షణాలే స్థానిక వినియోగదారులతో పాటు ఇతర ప్రాంతాల మార్కెట్లలోనూ దీనికి గుర్తింపు తీసుకొచ్చాయి.

వ్యక్తిగత పార్శిళ్ల నుంచి విదేశాల స్థాయికి..

ఇక్కడి కంది పప్పును విదేశాల్లో నివసించే తెలంగాణ ప్రాంత వాసులకు వారి కుటుంబ సభ్యులు పంపుతుంటారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం లభించింది. ఆస్ట్రేలియాకు తొలి విడతలో 2.5 మెట్రిక్‌ టన్నులు ఎగుమతి కావడం ఈ మార్పునకు నిదర్శనం. అక్కడి మార్కెట్‌లో ఈ ఉత్పత్తికి లభించే ఆదరణను బట్టి భవిష్యత్తులో మరిన్ని ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది.

రైతులకు ప్రయోజనం శూన్యమేనా..?

తాండూరు కందిపప్పు విదేశాలకు ఎగుమతి కావడం ఈ ప్రాంతానికి గర్వకారణమే అయినప్పటికీ, దాని ద్వారా స్థానిక రైతులకు ఎంత మేర ప్రయోజనం చేకూరుతుందనేది కీలక అంశం. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగినా, ఆ ప్రభావం రైతులు విక్రయించే కందుల ధరల్లో ప్రతిఫలించాలి. రైతులకు గిట్టుబాటు ధర, మార్కెట్‌ సమాచారం నాణ్యత ప్రమాణాలపై అవగహన కల్పించడంతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, మిల్లర్లు, వ్యాపారులు, ఎగుమతిదారుల మధ్య సమన్వయం ఏర్పరిచేలా ప్రభుత్వం చొరవ చూపాలి. మరోవైపు కందుల శుద్ధి, నాణ్యత పరీక్షలు, నిల్వలు, ప్యాకేజింగ్‌, రవాణా వంటి అంశాల్లో మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వస్తే ఎగుమతులను నిరంతరం కొనసాగించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సరఫరా చేయగలిగితే తాండూరు కందిపప్పుకు మరిన్ని దేశాల్లో మార్కెట్‌ అవకాశాలు ఏర్పడతాయి.

ప్రత్యేక బ్రాండ్‌గా..

తాండూరు కంది పప్పును అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రత్యేక బ్రాండ్‌గా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాం. ఆస్ట్రేలియాతో పాటు మరిన్నీ దేశాలకు ఎగుమతి అయ్యేలా చూస్తాం. స్థానికంగా మార్కెటింగ్‌, ప్రాసెసింగ్‌, ఎగుమతులను ప్రోత్సహిస్తాం.

– మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్యే, తాండూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement