కరువు కాలం! | - | Sakshi
Sakshi News home page

కరువు కాలం!

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

ఎల్‌నినోతో అడుగంటుతున్న జలాలు సాగు, తాగునీటికి తప్పని తిప్పలు 20 మండలాల్లో అనావృష్టి.. ప్రభుత్వ ప్రకటన నిత్యావసర ధరలకు రెక్కలు భయాందోళనలో అన్నదాతలు

బషీరాబాద్‌: వానలు కురవలేదు.. భూగర్భ జలాలు పెరగలేదు.. బోర్లలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. రబీ సాగు మొదలుకాకముందే రైతుల్లో ఆందోళన మొదలైంది. వేసవి ఇంకా రాకముందే తాగునీటి కష్టాలు తప్పవేమోనన్న భయాలు నెలకొన్నాయి. ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతం వెరసి జిల్లాలో కరువు ఛాయలు కమ్ముకున్నాయి. గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 5.79 మీటర్ల నుంచి 11.96 మీటర్లకు పడిపోయింది. అంటే నీరు భూమి ఉపరితలం నుంచి మరో 6.17 మీటర్ల లోతుకు వెళ్లింది. మరోవైపు ప్రభుత్వం జిల్లాలోని 20 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించడంతో పరిస్థితి తీవ్రత స్పష్టమవుతోంది.

ప్రమాద ఘంటికలు

భూగర్భ జలాల గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దుద్యాలలో 25.95 మీటర్లు, మర్పల్లిలో 24.05 మీటర్లు, దోమలో 16.33 మీటర్లు,పెద్దే ముల్‌లో 15.61 మీటర్లు, బషీరాబాద్‌లో 15.38 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. జిల్లాలో 20 మండలాల్లో 18 చోట్ల జలమట్టాలు తగ్గినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు పెరగలేదు. ఫలితంగా భూగర్భ జలాల పునరుద్ధరణకు ఆటంకంఏర్పడింది. రానున్న నెలల్లో నీటి వినియోగం పెరిగితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది.

కరువు కోరల్లో 20 మండలాలు

వర్షపాతం లోటు, పంటల సాగు విస్తీర్ణం, నేలలో తేమ, భూగర్భ జలాల పరిస్థితి తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వం కరువు మండలాలను గుర్తించింది. జిల్లాలో 11 మండలాలు తీవ్ర, 9 మండలా లు మధ్యస్థ కరువు ప్రభావిత ప్రాంతాలుగా వర్గీకరించినట్లు అందిన వివరాలు పేర్కొంటున్నాయి. కరువు ప్రకటన ఆరు నెలలపాటు అమల్లో ఉండనుంది. అయితే మండలాల వర్గీకరణ, ఉత్తర్వుల వివరాలను అధికారిక జాబితాతో సరిపోల్చాలి.

రైతులకు రాయితీలు అందేనా?

కరువు ప్రభావంతో నష్టపోయిన అర్హులైన రైతులకు పెట్టుబడి రాయితీ అందించే అవకాశం ఉంది. కేంద్ర విపత్తు సహాయ నిధుల నుంచి సాయం అందిన తర్వాత అర్హుల ఖాతాల్లో నగదు జమ చేయాలని నిబంధనలు సూచిస్తున్నాయి. పంట నష్టం అంచనా, అర్హతల పరిశీలన, నిధుల లభ్యత ఆధారంగా సాయం అందనుంది. తాగునీటి సరఫరా పెంపు, పశుగ్రాసం అందుబాటు, అవసరమైన చోట పశువుల శిబిరాలు, గ్రామీణ ఉపాధి పనులపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.

రబీ సాగుకు నీటి గండం!

జలమట్టాలు తగ్గడంతో బోర్లు, బావులపై ఆధారపడే రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పంటలకు సకాలంలో తడులు అందక దిగుబడులు తగ్గుతాయన్న ఆందోళన నెలకొంది. బషీరాబాద్‌ మండలం అల్లాపూర్‌, దామర్‌చెడ్‌, మైల్వార్‌ తదితర గ్రామాల్లో బోర్లపై ఆధారపడే రైతులకు నీటి లభ్యత కీలకంగా మారింది. తక్కువ నీటితో పండే పంటలకు ప్రాధాన్యమివ్వడం, బిందు, తుంపర సేద్యాన్ని అనుసరించడం ద్వారా నీటిని ఆదా చేయవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

పొలం వద్దే వడ్ల కొనుగోళ్లు

వానాకాలం వరి పంట కోతకు వస్తుండగా, రబీలో వరి సాగు చేయొద్దని సర్కారు ముందుగానే ప్రకటించింది. దీంతో వ్యాపారులు పొలాల వద్దకే వచ్చి వడ్ల కొనుగోలుకు అడ్వాన్సులు ఇస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 4,500 నుంచి రూ.5 వేల వరకు చెల్లించేందుకు ముందుకొస్తు న్నట్లు సమాచారం. సన్నబియ్యం ధరలు పెరగడం, నీటి కొరత తో కూరగాయల ది గుబడులు తగ్గే అవ కాశాలు వినియోగదారులను కలవరపెడుతున్నాయి.ధరల పె రుగుదల కొనసాగితే సామాన్య కుటుంబాలపై అదనపు భారం పడనుంది.

జిల్లాలో కోరలు చాచిన క్షామం

జిల్లాలో భూ గర్భ జలాలు ఇలా..

మండలం గతేడాది సెప్టెంబర్‌లో ప్రస్తుతం తగ్గిన నీటి మట్టం

(మిల్లీ మీటర్లలో)

దోమ 3.1 16.33 13.32

మర్పల్లి 10.71 24.05 13.34

బషీరాబాద్‌ 5.42 15.38 9.96

దుద్యాల 15.98 25.95 9.97

పెద్దేముల్‌ 6.89 15.61 8.72

వికారాబాద్‌ 4.90 12.80 7.90

తాండూరు 3.0 9.53. 6.53

జిల్లా సగటు 5.79 11.96 6.17

నీటి పొదుపుతోనే ఊరట

చెరువులు, కుంటల పునరుద్ధరణ, ఇంకుడు గుంతల వినియోగం, వర్షపు నీటిసంరక్షణకు ప్రాధాన్యమివ్వాలని అధికారులు సూచిస్తున్నారు. విచ్చలవిడిగా బోర్లు తవ్వకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని ఇఒప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లో తాగునీటి వనరులను ముందుగానే పరిశీలించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. భూగర్భ జలాల పరిస్థితిని క్రమం తప్పకుండా సమీక్షిస్తూ వేసవి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ముందస్తు చర్యలు సమర్థంగా అమలైతేనే రైతులకు, గ్రామీణ ప్రజలకు కరువు కష్టాల నుంచి కొంత ఊరట లభిస్తుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement