అనంతగిరి: రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని కొండ బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్‌లో బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై దాతలను అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సమా జంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకోవడం, వారి ఆశయాలకు అనుగుణంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రా జేష్ మీనా,డీఎస్పీ అంజయ్య, ఏఆర్ డీఎస్పీ వీరేష్, రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు సాయి చౌదరి, కార్యదర్శి డాక్టర్. సత్యనారాయణ గౌడ్, వికారాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్ రఘు కుమార్, మోమిన్‌పేట్ సీఐ వెంకట్, ధారూర్ సీఐ రఘురాం, తాండూరు ఇన్‌స్పెక్టర్ పరమేశ్వర్, కరణ్‌కోట్ సీఐ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
మహిళలు, బాలల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో జిల్లా మహిళా భద్రతా విభాగం ఏర్పాటు, పనితీరు, భరోసా కేంద్రాల నిర్వహణ, ఆర్థిక అంశాలు, టీఎస్ ఎస్‌ఓ పోర్టల్‌లో పెండింగ్ కేసులు తదితర అంశాలపై బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేశ్ మీనా, డీసీఆర్‌బీ డీఎస్పీ జానయ్య, ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాషా, భరోసా ఇన్‌స్పెక్టర్ ప్రమీల, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


