ఇబ్రహీంపట్నం: పేద ప్రజల కోసం ప్రాణాలర్పించిన కామ్రేడ్స్ మహబూబ్ పాష, నరహరి ఆశయాల సాధనకు ఉద్యమించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బోడ సామెల్ పిలుపునిచ్చారు. పాష,నరహరి వర్దంతిని పురస్కరించుకొని సోమవారం ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ చౌరస్తాలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సామెల్ మాట్లాడుతూ.. పేదల హక్కుల కోసం పోరాడిన యోధులు పాష, నరహరి అని కొనియాడారు. అనేక గ్రామాల్లో భూ పోరాటాలు నిర్వహించి పేదలకు పంచారన్నారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కాడిగళ్ల భాస్కర్, కె.జగన్, జిల్లా కమిటీ సభ్యులు జంగయ్య, పి.జగన్, మండల కార్యదర్శి బుగ్గరాములు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు భూ పంపిణీ వారి ఘనతే..
యాచారం: కామ్రేడ్ పాష, నరహరిల పోరాటాలతో నాటి కాంగ్రెస్ సర్కార్ పేదలకు భూ పంపిణీ చేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి బోడ సామెల్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ ఆధ్వర్యంలో సోమవారం పాష, నరహరి వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత పేదల సమస్యలపై పాష, నరహరి ప్రాణం ఉన్నంత వరకు పోరాటాలు చేశారని గుర్తు చేశారు. వారు మృతి చెంది 37 ఏళ్లు అవుతున్నా పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో మంచాల మాజీ ఎంపీపీ పగడాల యాదయ్య, పి.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


