అనంతగిరి: సమాజంలో వెట్టిచాకిరీ వంటి అమానవీయ విధానాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. వెట్టి చాకిరీ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్మిక శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాన్ని సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. వెట్టిచాకిరీ నిర్మూలనకు కృషి చేస్తామని, చట్టాల అమలులో నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని, అందరికీ సమానత్వం, సామాజిక న్యాయం జరిగేలా పనిచేస్తామని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వెట్టిచాకిరీ బాధితులను గుర్తించి, విముక్తి కల్పిస్తామన్నారు. వీరికి పునరావాసం కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలు అందేలా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఎవరైనా బాధితులను గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
వాల్మీకి మహర్షికి ఘన నివాళి
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ తివారి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన బోధనలు సమాజాన్ని సత్యం, ధర్మం, న్యాయం, మానవీయ విలువల మార్గంలో నడిచేందుకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుటూరు, కార్మిక శాఖ అధికారి వాల్యనాయక్, బీసీ, ఎస్సీ వెల్ఫేర్ అధికారులు మాధవరెడ్డి, జైపాల్‌రెడ్డి, డీపీఓ జయసుధ, హైదరాబాద్ నుంచి వచ్చిన కళాకారులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ..
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదులు అందజేసి తక్షణ విచారణకు ఆదేశించారు.
కలెక్టర్ దీపక్ తివారి


