సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఓ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే వేడుకలు నిర్వహించగా.. మొయినాబాద్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకొన్నారు. డ్రగ్ టెస్టు చేయగా.. ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి కనకమామిడి గ్రామ శివారులోని మ్యాంగో వుడ్ ఫామ్‌హౌస్, విల్లా నంబర్ 13లో కొంత మంది యువకులు గంజాయి వాడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. వెంటనే దాడులు జరిపి, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో బీహార్ రాష్ట్రానికి చెందిన బిషు కుమార్(25)కి పాజిటివ్ వచ్చినట్లు ప్రాథమిక టెస్టులో నిర్ధారణ అయ్యింది. అతడిని ఠాణాకు తరలించి విచారించగా ఐదు నెలల క్రితం మనీష్ మొమోస్ అనే వ్యక్తి ద్వారా గంజాయి కొనుగోలు చేసి, వాడినట్లు వెల్లడించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తుర్కయంజాల్: శ్రీరాముడు, రావణాసురుడి మీద విజయం సాధించడానికి గుర్తుగా.. మహాభారతంలో పాండవులు 12 ఏళ్లు అరణ్యవాసం గడిపి విజయం సాధించడానికి గుర్తుగా ఏటా విజయ దశమిని జరుపుకొంటున్నామని విశ్రాంత యువసేన అధికారి, ప్రముఖ సంఘ సేవకుడు సీబీఆర్ ప్రసాద్ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం తొర్రూర్ డివిజన్ న్యూ సూభాష్ నగర్‌లో నిర్వహించిన విజయదశమి పదసంచాలన్ కార్యాక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్క స్వయం సేవక్ నిమగ్నమై ఉండాలని, దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని అన్నారు. కొంతమంది యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, లవ్ జిహాద్, మత మార్పిడులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సేవ ప్రముఖ్ గాజుల శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
బస్సు కోసం
ఎదురు చూస్తుండగా..
డీసీఎం ఢీకొని మహిళ మృతి
మొయినాబాద్: రోడ్డుపై బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళను అతివేగం, అజాగ్రత్తగా వస్తున్న ఓ డీసీఎం ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరుకు చెందిన మల్లేశ్, చిన్న నాగమణి (50) దంపతులు. ఆదివారం ఉదయం చిన్న నాగమణి తన కూతురు దగ్గరకు వెళ్లేందు కోసం అజీజ్‌నగర్ చౌరస్తాలో బస్సు కోసం నిలబడి ఉంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి మొయినాబాద్ వైపు అతివేగం, అజాగ్రత్తగా వస్తున్న ఓ డీసీఎం డ్రైవర్ ఆమెను బలంగా ఢీ కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలతో చిన్న నాగమణి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఎలక్ట్రీషియన్ అదృశ్యం
చేవెళ్ల: ఇంట్లో రాత్రి నిద్రించిన వ్యక్తి ఉదయం లేచే సరికి కనిపించకుండా పోయాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ మండలం పద్మాశాలిపురానికి చెందిన వరకాల నరేశ్ (35) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల కిత్రం చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన బాలమణితో వివాహం జరిగింది. వివాహానంతరం చేవెళ్లలో కొన్నాళ్లు అద్దె ఇంట్లో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు ఖాళీ చేసి కౌకుంట్ల గ్రామానికి వచ్చి ఉంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 23న రాత్రి ఇంట్లో పడుకున్న నరేశ్ శనివారం తెల్లవారి లేచి చూసే సరికి కనిపించలేదు. చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో అతని భార్య ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


