ఇబ్రహీంపట్నం: పేద ప్రజల కోసం ప్రాణాలర్పించిన మహబూబ్ పాష, నరహరిల స్ఫూర్తితో సీపీఎం ప్రజా పోరాటాలు నిర్వహిస్తోందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బోడ సామెల్ అన్నారు. స్థానిక పాషనరహరి స్మారక కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మిక, కర్షక, కష్టజీవుల అభ్యున్నతికి నిరంతరం పోరాటం చేసిన పాష, నరహరిలను భూస్వాములు, మతోన్మాదులు కక్షగట్టి దారుణంగా హతమార్చారని గుర్తు చేశారు. వారి వర్ధంతి సభలను గ్రామగ్రామాన నిర్వహించాలని.. ఇబ్రహీంపట్నంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సోమవారం నిర్వహించే సభకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కె.జగన్, జిల్లా కమిటీ సభ్యులు పి.జగన్, పి.అంజయ్య, ప్రకాశ్ కారత్, యాదగిరి, విజయ్, కార్తీక్, కృష్ణ పాల్గొన్నారు.


