పరిగి: జాతీయ రహదారిపై కారు టాప్‌పై కూర్చుని విన్యాసాలు చేస్తూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై శనివారం పరిగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవివరాలతో శనివారం సాక్షిలో ప్రచురితమైన వార్తకు స్పందించిన ఎస్‌ఐ మోహనకృష్ణ సదరు కారును గుర్తించి సీజ్ చేశారు. కారుతో హల్‌చల్ చేసి, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించిన నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ప్రశాంతంగా అసిస్టెంట్
సైంటిస్ట్ పరీక్ష
మొయినాబాద్: అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్–2) పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు,మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించారు.సమయానికంటే గంట ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన ఐదు కేంద్రాల్లో 46.46 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. 665 మంది అభ్యర్థులకుగాను 309 మంది మాత్రమే పరీక్ష రాశారు, 356 మంది హాజరు కాలేదు. గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో 125 మందికి 65 మంది, చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీలో 120 మందికి 53, కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 200 మందికి 80, జేబీఐఈటీ కళాశాలలో 120 మందికి 66, వీజేఐటీ కళాశాలలో 100 మందికి 45 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
విజయం సాధించేదాకా
విశ్రమించొద్దు
బడంగ్‌పేట్: విజయం సాధించే వరకు విశ్రమించొద్దని అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి పోటీపరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు సూచించారు. బడంగ్‌పేటలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠకులకు అందిస్తున్న సదుపాయాలు, నిర్వహణ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లైబ్రరీకి వచ్చిన పాఠకులతో మాట్లాడారు. విద్యార్థుల పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంచాలని గ్రంథ పాలకులకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పీజీవీ రాణి, గ్రంథాలయ సిబ్బంది ఉన్నారు.
మేడిపల్లి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అధిక మొత్తంలో డబ్బు తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై ఓ మహిళ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన మేరకు.. మేడిపల్లిలోని కెనరా నగర్‌కు చెందిన ఓ మహిళ (41) నారపల్లిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. 2024 ఆగస్టులో ఓ మాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన ప్రదీప్ కోనేటి పెళ్లి చేసుకుంటానని నమ్మించి పరిచయం ఏర్పరచుకున్నాడని ఫిర్యాదులో ఆరోపించింది. వ్యాపారం పేరుతో డబ్బులు తీసుకోవడంతో పాటు బంగారు ఆభరణాలు, బ్యాంక్ లావా దేవీలు, ఆన్‌లైన్ రుణాల ద్వారా తనను ఆర్థికంగా నష్టపరిచాడని ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు, అతడి అనుచరులు కలిసి మొత్తం రూ.1,18,94,098 తీసుకున్నారని తెలిపింది. తమ వివరాలు బయట పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


