బషీరాబాద్: తాండూరు కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మధ్య విభేదాల నేపథ్యంలో.. ఎమ్మెల్యే వైఖరిపై అసంతృప్తితో ఉన్న పలువురు సీనియర్ నేతలు శుక్రవారం రాత్రి బషీరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు నివాసంలో మహేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి నష్టం జరుగుతోందని, మొదటి నుంచి కాంగ్రెస్ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని నారాయణరావు ప్రస్తావించినట్లు తెలిసింది. అవసరమైతే ముఖ్యమంత్రిని కలిసి తాండూరు కాంగ్రెస్ ఇన్చార్జి బాధ్యతలను మహేందర్‌రెడ్డికి అప్పగించాలని కోరుతామని చెప్పినట్లు సమాచారం. అందరినీ కలుపుకొని వెళ్లే నాయకత్వం అవసరమని, మహేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తామంతా అండగా నిలిచి గెలిపించేందుకు కృషి చేస్తామని నేతలు హామీ ఇచ్చినట్లు తెలిసింది. భవిష్యత్తులో తమకు అండగా ఉండాలని కోరినట్లు సమాచారం. దీనిపై మహేందర్‌రెడ్డి స్పందిస్తూ.. నాయకులందరికీ అన్ని విషయాల్లో అండగా ఉంటానని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చినట్లు భేటీలో పాల్గొన్న నేతలు తెలిపారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాకేశ్ మహరాజ్, నాయకులు మాధవరెడ్డి, వెంకట్రామ్రెడ్డి, వెంకటేశ్ మహరాజ్, రోహివత్ మహరాజ్, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, రాంనాయక్, నర్సిరెడ్డి, పవన్ ఠాకూర్, సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే నారాయణరావు ఇంట్లో సమావేశం
ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలపై నేతల చర్చలు


