పేదలను ముంచి పెద్దలకు పంచుతున్నారు | - | Sakshi
Sakshi News home page

పేదలను ముంచి పెద్దలకు పంచుతున్నారు

Oct 23 2026 7:18 AM | Updated on Oct 23 2026 7:18 AM

అందరికీ నష్టం

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘నాడు ఇందిరాగాంధీ పేదలకు భూములను పంచితే.. ఆమె పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి బలవంతపు భూ సేకరణకు పాల్పడుతున్నాడు. పరిశ్రమల పేరుతో పేదల భూములు దోచి.. పెద్దలకు కట్టబెడుతున్నాడు. రెండున్నరేళ్లలో ఒక్క పరిశ్రమ రాలేదు. ఒక్కరికి కూడా ఉద్యోగం దక్కలేదు. అయినా నిత్యం ఏదో ఒక పేరుతో భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఉమ్మడి జిల్లా రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు.’ అని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ‘సాక్షి ప్రతినిధి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె మాటల్లోనే..

ప్రభుత్వం నాపై కత్తికట్టింది

సీఎం రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం నాపై కత్తికట్టి, కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నేను మహేశ్వరానికి మంజూరు చేయించుకున్న రూ.280 కోట్ల నిధులను రద్దు చేసింది. అరవై శాతం కమీషన్లకు ఆశపడి అవసరం లేకపోయినా మహేశ్వరం, కందుకూరులో హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేసింది. వీటి కరెంట్‌ బిల్లులు ఆయా జీపీలకు పెద్ద గుదిబండలా మారాయి. ఎన్నికల్లో నాపై పోటీ చేసి ఓటమి పాలైన వాళ్లు.. అధికారులపై పెత్తనం చలాయిస్తున్నారు. మహేశ్వరం మెడికల్‌ కాలేజీని మరో చోటికి తరలించారు. 400 పడకల ఆస్పత్రి నిర్మాణానికి నిధులు మంజూరైనా ఉద్దేశ పూర్వకంగానే ఆ పనులను అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఉమ్మడి జిల్లాకు తీరని అన్యాయం జరుగుతోంది. రూ.6,478 కోట్లతో ప్రతిపాదించిన హ్యామ్‌ రోడ్లను ఒకే కాంట్రాక్టర్‌కు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వ వేధింపులు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు.

అవసరం లేకపోయినా..

నిరుద్యోగ యువతకు పెద్ద ఎతున ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో కందుకూరు, యాచారం మండలాల్లో 19,330 ఎకరాలు సేకరించింది. ఫార్మా పరిశ్రమలు వస్తే ఈ ప్రాంతం కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందని, తాము అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేసి, రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని కాంగ్రెస్‌ నేతలు హామీ ఇచ్చారు. అధికారం వచ్చిన తర్వాత ఫ్యూచర్‌సిటీ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెరతీశారు. అనామక కంపెనీలకు అడ్డగోలుగా భూములు కట్టబెడుతున్నారు. అన్నాదమ్ముళ్లు కలిసి వందలాది ఎకరాలు కొల్లగొట్టారు. వాటి ధరలు పెంచుకునేందుకు అప్పటికే మంజూరైన శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్‌ రహదారులను వదిలేసి, అవసరం లేకపోయినా కొత్తగా రెండు రేడియల్‌ రోడ్లను తెరపైకి తెచ్చారు. వీటి వల్ల సీఎం సోదరులకు మినహా.. సాధారణ ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు.

నోటిఫికేషన్లు.. లూటిఫికేషన్లు

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. ఇప్పటికే సేకరించిన భూముల్లో కొత్తగా ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు. భూములిచ్చిన ఏ ఒక్క రైతు కుటుంబానికి ఉద్యోగ అవకాశం దక్కలేదు. గత ప్రభుత్వ హయాంలో వికారాబాద్‌ జిల్లా మన్నెగూడ, మోమిన్‌పేటలో 1,200 ఎకరాలు సేకరించి పెట్టింది. వీటిలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదు. గుడిమల్కాపూర్‌లోని పూలమార్కెట్‌ను అజీజ్‌నగర్‌కు తరలించనున్నట్లు ప్రకటించారు. ఇందుకు 40 ఎకరాలు సరిపోతుంది. కానీ ప్రభుత్వం 250 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్‌ చేసింది. ఎన్కెపల్లిలో గోశాల పేరుతో 100 ఎకరాలకు, మామిడిపల్లిలో మరో 100 ఎకరాలకు ఎసరు పెట్టింది. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన లేకుండానే బుల్లెట్‌ౖ రెలు పేరుతో బహుదుర్‌గూడలో బలవంతపు భూసేకరణకు దిగింది. పక్కనే ఉన్న పెద్దల భూములను వదిలి కేవలం సాగులో ఉన్న పేదలను టార్గెట్‌ చేసింది. ఇక్కడ 600 ఎకరాలు కొల్లగొట్టేందుకు యత్నిస్తోంది. కొత్తగా మరికొన్ని భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. చేవెళ్ల మండలం ఆలూరులో 1,248 ఎకరాలు, పరిగిలో 1,179 ఎకరాలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. కొత్త పారిశ్రామిక వాడలు, రేడియల్‌ రోడ్ల పేరుతో పోలీసు బందోబస్తు మధ్య బలవంతపు భూసేకరణకు పాల్పడుతోంది. రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

22–ఏను అడ్డుపెట్టుకుని..

ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న విలువైన భూములను కొట్టేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నింది. గతంలో ప్రభుత్వాలు పరిశ్రమల ఏర్పాటు కోసం కేటాయించిన భూముల్లో అపార్ట్‌మెంట్లు కట్టుకునేందుకు కొత్తగా హిల్ట్‌పాలసీని తెరపైకి తీసుకొచ్చి రైతులు, పారిశ్రామికవేత్తలపై బెదిరింపులకు దిగుతోంది. చివరకు యూనివర్సిటీ భూములను సైతం అమ్ముకునేందుకు సిద్ధపడింది. 22– ఏపేరుతో వేలాది ఎకరాల పట్టాభూములను నిషేధిత జాబితాలో చేర్చి, ప్రజల జీవితాలతో ఆడుకుంటోంది. మూసీ రివర్స్‌ ఫ్రంట్‌ పేరుతో వేలాది మంది ఇళ్ల కూల్చివేతకు పాల్పడుతోంది.

అడ్డగోలు నోటిఫికేషన్లతో భూములు కొల్లగొడుతున్నారు

స్వలాభం కోసమే గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్ల నిర్మాణం

కాంగ్రెస్‌ పాలనలో ఉమ్మడి జిల్లాకు తీరని అన్యాయం

‘సాక్షి’తో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి

జీహెచ్‌ఎంసీ విభజన సహా పోలీసు కమిషనరేట్ల ఏర్పాటు కూడా పూర్తి అశాసీ్త్రయంగా జరిగింది. పక్కనే ఉన్న సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ను వదిలి.. మొయినాబాద్‌, చేవెళ్లను 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌లో కలిపారు. కమిషనర్‌ ఆఫీసును ఇప్పటికే ఒకసారి కలెక్టరేట్‌లో, మరో సారి ఫ్యాబ్‌సిటీలో ప్రారంభించారు. మీర్‌ఖాన్‌పేటలో భవనానికి శంకుస్థాపన కూడా చేశారు. తాజాగా ఇబ్రహీంపట్నం ఆక్టోపస్‌లో భవనాన్ని ప్రారంభించారు. కరెంట్‌, సాగు, తాగునీటి సంక్షోభాన్ని ఎల్‌నినోపై నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement