● కలెక్టర్ దీపక్ తివారి
● వికారాబాద్‌లో ఘనంగా పోలీసు
అమరవీరుల సంస్మరణ దినోత్సవం
● పాల్గొన్న ఎస్పీ స్నేహమెహ్ర
అనంతగిరి: పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ స్నేహ మెహ్రతో కలిసి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసుల త్యాగాన్ని కొనియాడారు. వారి సేవలు అంత్యంత విలువైనవని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలు దేశ భద్రతకు, ప్రజల శాంతిభద్రతల పరిరక్షణకు పునాదిగా నిలిచాయన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి ప్రమాదం ఎదురైనా ప్రజల రక్షణే ధ్యేయంగా సేవలందిస్తున్నారని అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసి పోలీసు అధికారుల సేవలకు స్మరించుకున్నారు. బాధిత కుటుంబాలకు సమాజం, ప్రభుత్వం అండగా నిలవాలని, వారి త్యాగాలను ఎప్పటికీ మరచిపోరాదన్నారు. వారు మన మధ్య లేకపోయినా ప్రజలకు సేవ చేయాలనే వారి స్ఫూర్తి ప్రతి పోలీసు అధికారిలో సజీవంగా ఉంటుందని తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రతి పోలీసు అధికారి సిబ్బందికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజన్నారు. దేశ భద్రత, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన అమర వీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. ప్రతి పోలీసు అధికారి వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని నిజాయితీ, నిబద్దత, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తే వారి సమస్యలను సానుభూతితో విని చట్ట పరిదిలో న్యాయం అందించేందుకు కృషి చేయాలన్నారు. పోలీసు అమరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. విధి నిర్వహణలో ఎదుర య్యే ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడమే నిజమైన పోలీసింగ్ అని తెలిపారు. సురక్షితమైన ప్రశాంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయచాలని పిలుపునిచ్చారు. సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని పోలీసులకు నిర్వహించిన ఎస్‌ఐస్థాయి వ్యాసరచన పోటీల్లో మొదటి స్థాని కోట్‌పల్లి ఎస్‌ఐ మీనాక్షి, రెండో స్థానం పెద్దేముల్ ఎస్‌ఐ ప్రశాంత్‌వర్ధన్, తృతీయ స్థానం పరిగి ఎస్‌ఐ మోహన్ కృష్ణ నిలవగా ఏఎస్‌ఐ స్థాయి వరకు వరుసగా ప్రత్యూష(పీసీ), సంతోష్(పీసీ), దీపిక(పీసీ) నిలిచారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాజేష్ మీనా, డీఎస్పీలు జానయ్య, శ్రీనివాస్, అంజయ్య, యాదయ్య, శ్రీనివాస్, వీరేష్, సీఐలు, ఎస్‌ఐలుచ, ఆర్‌ఎస్‌ఐలు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


