స్పీకర్ ప్రసాద్ కుమార్
దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో అసువులు బాసిన పోలీసుల త్యాగం మరువలేనిదని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీస్ యూనిఫాం అధికారానికి చిహ్నం మాత్రమే కాదని, ప్రజల ప్రాణాలు, హక్కులు, రాజ్యాంగ విలువలను కాపాడే పవిత్ర బాధ్యతకు ప్రతీక అని తెలిపారు. ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకొంటున్నామని గుర్తు చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం, నేరాలను అరికట్టడం కోసం, విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ప్రతి పోలీసు అమరవీరుడికి నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. వారి బలిదానాలు దేశ భద్రతకు, ప్రజల శాంతిభద్రతల పరిరక్షణకు పునాదిగా నిలిచాయన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి ప్రమాదం ఎదురైనా, ప్రజల రక్షణే ప్రధాన లక్ష్యంగా నిరంతరం సేవలందిస్తున్నారని కొనియాడారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడటం అందరి బాధ్యత అన్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం పోలీసు సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అమరవీరుల త్యాగాలు పోలీస్ శాఖకు నిరంతర స్ఫూర్తి అని, ప్రతి పోలీస్ అధికారి వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు.


