వికారాబాద్‌లో కిటకిటలాడుతున్న వస్త్ర దుకాణం
కుల్కచర్ల: పూజలందుకున్న అమ్మవారు
అనంతగిరి: పూలు, పండ్లు కొనుగోలు చేస్తున్న జనం
వికారాబాద్: ఊరూ వాడా దసరా సందడి కనిపిస్తోంది. పెద్ద పండుగ కావడంతో దూర ప్రాంతాల్లో ఉంటున్న వారంతా సొంత గ్రామాలకు చేరుకున్నారు. ఆప్యాయ పలకరింపులు, బంధువుల క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. హిందూ ఉత్సవ సమితీ ఆధ్వర్యంలో పండుగ ఏర్పాట్లు చేశారు. రావణ దహణానికి సర్వం సిద్ధం చేశారు. ప్రధాన కూడళ్లల్లో పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేశారు. ఆడపడుచులు గ్రామాలకు రావడంతో ఇళ్లన్నీ కళకళలాడుతున్నాయి. కొత్త బట్టల కొనుగోలు దాదాపు పూర్తయ్యింది. పండుగ సామగ్రి ఇంటికి చేరింది. పిండి వంటలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పది రోజులుగా విద్యా సంస్థలకు సెలవులు రావడంతో చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. ఆడపడుచులకు చీర సారె పెట్టడం ఆనవాయితీ. దీంతో బట్టల దుకాణాలు సందడిగా మారాయి. పూలు, గుమ్మడి కాయలు కొనే పనిలో ప్రజలు నిమగ్నమయ్యారు. వీటి ధర రెండింతలయ్యాయి. పండగ నేపథ్యంలో మద్యం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ముస్తాబైన ఆలయాలు పండుగ సందర్భంగా జిల్లాలోని అన్ని ఆలయాలు ముస్తాబయ్యాయి. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించనున్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జమ్మి చెట్టుకు పూజ చేయనుండటంతో చెట్లు పరిశసరాలను శుభ్రం చేశారు.
గ్రామాల్లో బంధువుల సందడి
పండుగ సామగ్రి కొనుగోలులో జనం బిజీ
రావణ దహణానికి ఏర్పాట్లు
భారీగా పెరిగిన పూలు, గుమ్మడికాయల ధరలు


