మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి
తాండూరు: విజయ దశమి పండుగ విజయాలు అందించాలని మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు విజయాలు, పాడి పంటలు, సుఖశాంతులతో తులతూగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. దసరా పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. అనంతరం ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
తాండూరు రూరల్: మండలంలోని చెన్‌గేస్‌పూర్ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్‌గా ఆర్ శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డైరెక్టర్లుగా వెంకటప్ప, బాలసాగర్ గౌడ్, కాశప్ప, మమతను నియమించారు. చైర్మన్‌గా నియమితులైన శ్రీనివాస్‌రెడ్డిని గ్రామ నాయకులు శ్రీశైలంగౌడ్, రాజు గౌడ్, ఆర్ వెంకటేశ్, వెంకటయ్య, యాసిన్ అభినందించారు. త్వరలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
కొడంగల్ రూరల్: మండలంలోని పర్సాపూర్‌లో గ్రామ యువత ఆధ్వర్యంలో సర్పంచ్ కన్నం రాధా శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో నిర్వహించనున్న కబడ్డీ పోటీలను సోమవారం మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తట్టేపల్లి రాములు, ఉప సర్పంచ్ శివమ్మ, నాయకులు దస్తప్ప, శ్రీశైలం, నర్సింలు, మధుమతి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ రూరల్: పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్‌లోని మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బాలాలయంలో నేడు(మంగళవారం) దసరా పారువేట ఉత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, సాయంత్రం 5గంటలకు శమీ పూజ కార్యక్రమాలను ఆలయ వంశపార పర్య ధర్మకర్తలు నిర్వహిస్తారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
కందుకూరు: కారు అదుపు తప్పి దేవాలయం కోనేరులోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న డ్రైవర్ తేరుకుని అద్దం తీసుకుని బయటికి రావడంతో ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సంఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమనగల్లు మండలం కోనాపూర్‌కు చెందిన చెందిన బొడ్డుపల్లి కుమార్ (32) గ్రామంలో టీ దుకాణం నిర్వహిస్తూ వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం పని ముగించుకుని అర్ధరాత్రి సమయంలో కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. మార్గమధ్యలో మహేశ్వరం శివగంగ దేవాలయం వద్ద హైదరాబాద్ వైపు మళ్లాల్సి ఉండగా నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో కారు నేరుగా శివగంగ కోనేరులోకి బారికేడ్లను ధ్వంసం చేసుకుంటూ వెళ్లి నీటిలో మునిగింది. ఆ సమయంలో అప్రమత్తమైన కుమార్ అద్దం దింపి అందులో నుంచి బయటపడ్డాడు. ఓ వైపు ఆలయం, మరోవైపు ట్రాన్స్‌ఫార్మర్ ఉన్నాయి. అదృష్టవశాత్తు ఆ రెండింటి మధ్య నుంచి దూసుకుపోవడంతో డ్రైవర్ ప్రాణాలతో బయపడ్డాడు. సోమవారం ఉదయం పోలీసులు క్రేన్ సాయంతో కారును బయటికి తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


