రేపటి నుంచి ఆర్థిక సమ్మిళిత ప్రచారం | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఆర్థిక సమ్మిళిత ప్రచారం

Oct 21 2026 8:14 AM | Updated on Oct 21 2026 8:14 AM

అనంతగిరి: కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు ఈ నెల 21 నుంచి డిసెంబర్‌ 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో ‘ఆర్థిక సమ్మిళిత సంతృప్త ప్రచారం’ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ దీపక్‌ తివారి తెలిపారు. ప్రధానమంత్రి జనధన్‌ యోజన, జీవన్‌ జ్యోతి బీమా యోజన, సురక్షా బీమా యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన వంటి పథకాల కవరేజీని పెంచి, అర్హులైన ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్‌.. సామాజిక భద్రతా సేవలు అందేలా చూస్తామని పేర్కొన్నారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ డేవిడ్‌ విల్సన్‌ జిల్లాస్థాయి నోడల్‌ అధికారిగా ప్రచారాన్ని సమన్వయం చేసి పర్యవేక్షిస్తారని తెలిపారు. డీఆర్డీఏ, మెప్మా, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్‌ కమిషనర్లు, మండల, గ్రామ స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ప్రజలు తమ గ్రామంలో నిర్వహించే శిబిరానికి అవసరమైన పత్రాలతో (ఆధార్‌, పాన్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, మొబైల్‌ నంబరు తదితర పత్రాలు) హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సత్వరం పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచరాదని, సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ

యాక్ట్‌ నవ్‌ సెవ్‌ పాలపిట్ట అనే సందేశంతో రూపొందించిన వాల్‌పోస్టర్‌ను సోమవారం కలెక్టర్‌ దీపక్‌తివారి తన చాంబర్‌లో ఆవిష్కరించారు. పాలపిట్ట సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, వన్య ప్రాణాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. డీఎఫ్‌ఓ వికాస్‌ బత్తుల, ఎఫ్‌ఆర్‌ఓ నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ దీపక్‌ తివారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement