నవాబుపేట: పక్కింటివారు మాటలతో దూషించారని మనస్థాపం చెందిన గృహిణి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిట్టిగిద్ద గ్రామానికి చెందిన అయ్యగల్ల ఆశీర్వాదం భార్య సుమలత (27). వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 16వ తేదీ ఉదయం సుమలత కూతురు అనన్యశ్రీ ఇంటి ముందు ఆడుకుంటుండగా తల్లి మందలించింది. ఆ మాటలు విన్న పాలివారు.. కూతురు నెపంతో మమ్మల్ని తిడుతున్నావా అని దూషించారు. ఈ విషయాన్ని సుమలత భర్తకు చెప్పగా ఆయన కూడా భార్యనే మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుమలత ఆదివారం రాత్రి ఉరివేసుకుంది. గమనించిన భర్త కొన ఊపిరితో ఉన్న భార్యని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే సుమలత మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరి తెలిపారు.


